పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నం : మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నం : మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి
  • ఇండ్లు పొందిన కుటుంబాల్లో ఆనందం చూస్తుంటే సంతృప్తిగా ఉంది: మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి
  •     సర్ ప్రక్రియతో ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నం 
  •     కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని బీజేపీ చూస్తోంది: ఎంపీ వంశీకృష్ణ 
  •     కోటపల్లిలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి, ఎంపీ

కోల్​బెల్ట్​/చెన్నూరు /కోటపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సొంతిళ్లు పొందిన కుటుంబాల్లో కనిపించే ఆనందం తమకు సంతృప్తిని ఇస్తోందని పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి, చెన్నూరు, మందమర్రి మండలాల్లో, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంత్రి వివేక్‌‌, ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. 

కోటపల్లి, రాజారం -కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. కొత్తింట్లోకి అడుగుపెట్టిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌లో చెన్నూరు, కోటపల్లి మండలాలు, మంచిర్యాలలోని మంత్రి నివాసంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ, మందమర్రిలోని బీ1 ఆఫీస్‌‌లో మందమర్రి మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతాల కాంగ్రెస్ కార్యకర్తలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై అవగాహన కల్పించారు. 

సర్‌‌‌‌పై బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు మంత్రి వివేక్ సూచించారు. సర్‌‌‌‌తో ఓట్లు తొలగించడం ద్వారా దక్షిణాదిలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో అధికారంలో ఉన్న సీఎంలు ఓడిపోవడానికి సర్ కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక్క ఓటు కూడా తొలగించకుండా వ్యవహరించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడన్నారు.

పదేండ్లలో కనీస వేతనాలు పెంచని బీఆర్‌‌‌‌ఎస్..​

బీఆర్‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు పెంచే ప్రయత్నం చేయలేదని, కనీస వేతనాలు పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని మంత్రి వివేక్ అన్నారు. కాళేశ్వరం పేరిట కమీషన్లు దండుకోవడం, సింగరేణి గనులు బంద్ చేయడంపైనే బీఆర్‌‌‌‌ఎస్ లీడర్లు దృష్టి పెట్టారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేసి మినిమం వేజెస్ పెంచుతూ చట్టం తెచ్చారన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కనీసం రూ.3 వేల వరకు వేతనాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

యువతను కేటీఆర్ నాశనం చేయాలని చూస్తుండు: వంశీకృష్ణ 

యువతను నాశనం చేయాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తున్నాడని ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. కేటీఆర్ మాటలు నమ్మితే యువత జైళ్ల పాలవుతారని చెప్పారు. 30 కేసులుంటేనే లీడర్ అవుతారని వ్యాఖ్యానిస్తూ కేటీఆర్ రాజకీయపబ్బం గడుపుకుంటున్నాడని, వారి మాటలు నమ్మి యువత తమ భవిష్యత్‌‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. అనేక స్కాంలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. 

సర్ వల్ల అర్హులైన వారి ఓట్లు కోల్పోకుండా చూడాలని, ఈ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించి లబ్ధి పొందాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో 65 ఏటీసీ కేంద్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి ఏర్పాటు చేయించారని, మరో 65 సెంటర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ సెంటర్లలో లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ, స్కిల్ డెవలప్‌‌మెంట్ ట్రైనింగ్ తీసుకొని మంచి ఉద్యోగాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.