ఇందిరమ్మ ఇల్లు కట్టుకోకపోతే క్యాన్సిల్‌‌‌‌ చేస్తాం .. మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

ఇందిరమ్మ ఇల్లు కట్టుకోకపోతే క్యాన్సిల్‌‌‌‌ చేస్తాం ..    మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

హుస్నాబాద్, వెలుగు : పదేండ్లలో గత ప్రభుత్వం నియోజకవర్గంలో 250 ఇండ్లు కూడా కట్టించలేదని, కాంగ్రెస్‌‌‌‌ వచ్చాక ఏడాదిలోనే 3,500 ఇండ్లు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. లబ్ధిదారులు ఇండ్ల పనులు ప్రారంభిస్తే వారం రోజుల్లోనే బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. 

పనులు మొదలుపెట్టని పక్షంలో ఇండ్లను క్యాన్సిల్‌‌‌‌ చేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌లో బుధవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అన్ని పీహెచ్‌‌‌‌సీలు, సబ్‌‌‌‌ సెంటర్లు నిరంతరం సేవలు అందించాలని సూచించారు. సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 విద్యుత్‌‌‌‌ సమస్యలు, వేలాడుతున్న కేబుల్స్‌‌‌‌ తొలగింపు కోసం రూట్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. సర్వాయి పాపన్న కోట, మహాసముద్రం గండి ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. 

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ లింగమూర్తి, మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్‌‌‌‌ తిరుపతిరెడ్డి, మార్కెట్‌‌‌‌ కమిటీ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ బంక చందు, సర్పంచ్‌‌‌‌ లక్ష్మి, వెటర్నీరీ డాక్టర్లు రమేశ్‌‌‌‌, వెంకట్‌‌‌‌రెడ్డి, సుకన్య పాల్గొన్నారు.