దేశంలో రోల్ మోడల్ గా ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి వివేక్ వెంకట స్వామి

దేశంలో రోల్ మోడల్ గా ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి వివేక్ వెంకట స్వామి
  •     జూన్ 2 న సెకండ్ ఫేజ్ ఇండ్ల పంపిణీ
  •     రైతులు ఆందోళన చెందవద్దు.. -చివరి గింజ వరకు ధాన్యం కొంటాం
  •     మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి

కోల్​బెల్ట్/కోటపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, దేశంలోనే రోల్​ మోడల్​గా ఈ పథకం నిలుస్తుందని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు. కోటపల్లి మండలంలోని దేవులవాడలో జమ్మిడి శరత్–భాగ్యలక్ష్మి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ నిరుపేదల సొంతింటికలను నిజం చేస్తోందన్నారు. 

దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో ఒక డబుల్ ​బెడ్రూం ఇల్లు, రేషన్​కార్డులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లు, కొత్త రేషన్​కార్డులు అందించిందని తెలిపారు. జూన్ 2న రెండో విడతా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీని చేపడుతున్నామని, అర్హత ఉన్న నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. 

హమాలీల కొరతతో ఇబ్బందులు

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హమాలీల కొరత ఏర్పడిందని, ఫలితంగా అక్కడక్కడ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి వివేక్​అన్నారు. ధాన్యం సకాలంలో అన్​లోడింగ్​కాకపోవడంతో లారీలు రాకలో జాప్యం జరుగుతోందన్నారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కారమవుతాయని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అంతకుముందు దేవులవాడలోని అంబేద్కర్​విగ్రహానికి మంత్రి వివేక్​ పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.