
ఇల్లు కట్టి చూడు.. పెళ్లిచేసి చూడు అనే సామెత.. ఇల్లు కట్టడం, ఆడపిల్ల పెళ్లిచేయడం అనేది సామాన్య, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా కష్టంతో కూడుకున్నది అని తెలియజేస్తోంది. అలాంటి కుటుంబాలకు ఆర్థికంగా మద్దతుగా నిలవడానికి పేదోడి సొంతింటి కల నెరవేర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసరాగా నిలుస్తున్నాయి.
పేదవాడి సొంతింటి కల నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అవాస్ యోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యాల కారణం వల్ల రాష్ట్రంలో గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో నో ఎంట్రీ బోర్డు ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకానికి డోర్లు తెరవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల ఆర్థిక సహాయంలో కేంద్ర ప్రభుత్వం వాటా లక్ష రూపాయల లబ్ధి ఉన్నది.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు అప్పులు తెచ్చి కేసీఆర్ డబుల్ బెడ్రూంల పేరుతో అర్బన్ ఏరియాలో ఇండ్లు నిర్మించి పంపిణీ చేశారు. కానీ, గ్రామాలలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు.
కేవలం కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామం తప్ప. పట్టణాలలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన ఇళ్లను వేలంపాట వేసి ఖజానా నింపుతున్నారు తప్ప ఇల్లులేని నిరుపేదలకు కేటాయించడం లేదు. హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించే గృహాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ సైనికులకు 2% రిజర్వేషన్ ఇండ్లు కేటాయించేవారు.
కానీ, తెలంగాణ రాష్ట్రంలో అది కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కరువైంది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో పారదర్శకత కనిపిస్తుంది. గ్రామాలలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలనే ఎంపిక చేయడం ఆహ్వానించదగ్గది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సహాయంతో గ్రామాలే లక్ష్యంగా పనిచేస్తే పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుతుంది.
- బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు-