ఈ సారి సగం గుడిసెలకు మోక్షం..ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో   22 వేల మంది ఎంపిక

ఈ సారి సగం గుడిసెలకు మోక్షం..ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో   22 వేల మంది ఎంపిక
  • రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకు పైగా పూరి గుడిసెల గుర్తింపు
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 10,038 గుడిసెలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పూరి గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల సొంతింటి కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. అర్హులైన ప్రతిఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ‘ఇందిరమ్మ ఇండ్ల పథకం’ కింద రెండో విడతలో పూరి గుడిసెల్లో ఉంటున్న పేదలకు ఇండ్లను మంజూరు చేస్తున్నారు. రెండో దశ ఇందిరమ్మ ఇండ్లను ఆసిఫాబాద్‌‌ జిల్లాలో సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో నియోజకవర్గానికి 500 గుడిసెలు, మరో 500 స్లాబ్‌‌కు ఆర్థిక సాయం, మరో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో 50 వేల పూరి గుడిసెలు..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 వేలకు పైగా పూరి గుడిసెలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 65 వేల గుడిసెల సర్వే పూర్తి కాగా, అర్హత కలిగిన 22 వేల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. అర్హులుగా తేలిన పేదలకు కలెక్టర్లు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నారు. మిగిలిన దరఖాస్తులను పరిశీలించిన వెంటనే అర్హులందరికీ విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 13,500 గుడిసెలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌‌ జిల్లాలో 10,042, నిర్మల్‌‌లో 6,500, వరంగల్‌‌ జిల్లాలో 4,300 పూరి గుడిసెలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన జిల్లాల్లోనూ సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అర్హులందరికీ న్యాయం చేస్తామని హౌసింగ్‌‌ అధికారులు తెలిపారు.