ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్​..ప్రతీ నియోజకవర్గానికి 3,500 సాంక్షన్​

ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్​..ప్రతీ నియోజకవర్గానికి 3,500 సాంక్షన్​
  • మంచిర్యాల జిల్లాలో పూర్తి కావొచ్చిన లబ్ధిదారుల ఎంపిక
  •  పైలట్​ ప్రాజెక్టు​ కింద ఫస్ట్ ఫేజ్​లో 2,150 ఇండ్లు
  • 887 గ్రౌండింగ్, బేస్​మెంట్ లెవల్ లో 115 ​
  • మొదటి విడత రూ.లక్ష జమ

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్​పెట్టడంతో పనులు స్పీడప్​అయ్యాయి.  ఇండ్లు లేని పేదలందరికీ దశల వారీగా రూ.5 లక్షలతో సొంత ఇల్లు కట్టిస్తోంది. ఫస్ట్​ ఫేజ్​లో ఇంటి స్థలం ఉన్నవారికి ప్రయారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను సాంక్షన్​ చేసింది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్​ నియోజకవర్గాల్లో 10,500 ఇండ్లు మంజూరవగా, ఖానాపూర్​ నియోజకవర్గంలోని జన్నారం మండలానికి అదనంగా సాంక్షన్ ఇచ్చింది.
 

అక్రమాలకు తావు లేకుండా చర్యలు

ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకుంది. వాటి ఆధారంగా గ్రామాల వారీగా అర్హుల జాబితా రూపొందింది.  పంచాయతీ సెక్రటరీలు ఫీల్డ్​లెవల్​లో ఎంక్వైరీ చేయగా, ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వార్షికాదాయం గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2.50 లక్షలకు మించకుండా, గతంలో ఇండ్లు రానివారిని సెలెక్ట్​ చేశారు. ఈ లిస్టు ఆధారంగా ఫస్ట్​ ఫేజ్​లో సొంత జాగలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్​ చేశారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మండలానికో గ్రామం..

ఫస్ట్​ ఫేజ్​లో మండలానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక​చేసి, ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించారు. బెల్లంపల్లి మండలంలో కన్నాలకు 56, భీమారం మండలం దాంపూర్​కు 87, భీమిని మంలం మల్లిడికి 170, చెన్నూర్​మండలం పొక్కూర్​కు 261, దండేపల్లి మండలం ధర్మారావుపేటకు 104, హాజీపూర్​ మండలం ర్యాలీకి 164, జైపూర్​ మండలం గంగిపల్లికి 117, తాండూర్​ మండలం గోపాల్​నగర్ కు 76, కన్నెపల్లి మండలం టేకులపల్లికి 65, కాసిపేట మండలం బుగ్గగూడెంకు 117, కోటపల్లి మండలం బొప్పారం గ్రామానికి 43, లక్సెట్టిపేట మండలం కొత్తూర్​కు 227, మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి 225, నెన్నెల మండలం జంగల్​పేట్ కు 290, జన్నారం మండలం కొత్తపేటకు 126 మొత్తం 2,150 ఇండ్లు సాంక్షన్​ చేశారు. వీటిలో 887 గ్రౌండింగ్​ కాగా, ఇందులో 115 ఇండ్లు బేస్​మెంట్​లెవల్​వరకు పూర్తయ్యాయి. మొదటి విడతగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష జమ చేశారు.  

400 నుంచి 600 స్క్వేర్​ ఫీట్లు..

ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వారికి ఇష్టమైన డిజైన్లలో కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే 400 నుంచి 600 స్క్వేర్​ ఫీట్ల విస్తీర్ణంలోనే నిర్మించుకోవాలని కండీషన్​ పెట్టింది. ఇంటి విస్తీర్ణం 400 ఫీట్ల కంటే తగ్గినా, 600 ఫీట్ల కంటే మించినా బిల్లు రాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలకు సొంతంగా కొన్ని డబ్బులు కలుపుకొని పెద్దగా ఇల్లు కట్టుకుందామనే ఆలోచనతో కొంతమంది లబ్ధిదారులు 600 ఫీట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు ప్రారంభించారు. అలాంటివారికి 600 ఫీట్ల విస్తీర్ణంలోనే స్లాబ్​ వేసుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు. మొత్తం నాలుగు విడతల్లో బిల్లులు మంజూరు చేస్తారు. కాగా, పలువురు లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణాలు ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నారు. 

నిబంధనల ప్రకారమే ఇండ్లు కట్టుకోవాలి

జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావొచ్చింది. అందరూ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. పైలట్​గ్రామాల్లో పనులు స్పీడప్​ చేస్తున్నాం. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇండ్లు కట్టుకోవాలి. 600 ఫీట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకుంటే బిల్లులు రావు. ఈ స్కీం పర్యవేక్షణకు ప్రభుత్వం ఔట్​సోర్సింగ్​లో 10 మంది ఏఈలను నియమించింది. మరో నలుగురు వచ్చే ఛాన్స్​ఉంది.  - బన్సీలాల్, జిల్లా హౌసింగ్ పీడీ