- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన 2 వేల ఇండ్ల మంజూరును వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, డిప్యూటీ ఇంజినీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరును పక్కాగా అమలు చేసి గృహ నిర్మాణ శాఖ మంచి పేరు తెచ్చుకున్నదని గుర్తుచేశారు. రెండో విడతను కూడా విజయవంతం చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
ఇండ్ల మంజూరు విషయంలో ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో ప్రాజెక్టు డైరెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దన్నారు.
