- హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
భద్రాద్రికొత్తగూడెం/చంద్రుగొండ, వెలుగు : భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఈ నెల 21న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఈ మేరకు సోమవారం బెండాలపాడులో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీంను పునఃప్రారంభించినట్లు చెప్పారు. మొదటి విడతలో భాగంగా రూ. 22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రెండున్నర లక్షల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలిన ఇండ్లకు కూడా అర్హులైన వారిని గుర్తించి మంజూరు పత్రాలు ఇచ్చామన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని బెండాలపాడులో 312 ఇండ్లు మంజూరు అయ్యాయని ఇందులో పూర్తైన 27 ఇండ్లకు గృహప్రవేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరుకానున్నారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎస్పీ రోహిత్ రాజు, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ పాల్గొన్నారు.
