
- జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం.. 33 జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున ఓపెనింగ్
- రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 200 ఇండ్లకు స్లాబ్ పూర్తి
- ఈనెలాఖరుకల్లా వెయ్యి ఇండ్లు పూర్తవుతాయంటున్న ఆఫీసర్లు
- జీహెచ్ఎంసీ పరిధిలో జీ ప్లస్ 3 మోడల్లో ఇండ్లు
- 15 చోట్ల స్థలాల గుర్తింపు, ఎకరాకు 300 చొప్పున ఇళ్ల నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 2న ఇందిరమ్మ లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక ఇంట్లో గృహప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. స్లాబ్ పూర్తయిన ఇండ్లను గుర్తించి ప్లాస్టరింగ్‌తో పాటు ఇంటీరియర్ పనులను స్పీడప్ చేసేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.
మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20 వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభంకాగా, ఇందులో 5,200 ఇండ్లు బేస్ మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇండ్లు గోడలు పూర్తయ్యి స్లాబ్ కు రెడీ అవుతుండగా మరో 200 ఇండ్లకు స్లాబ్స్ దాకా పూర్తయి ప్లాస్టరింగ్ పనులు జరుగుతున్నాయి. ఈనెలాఖరు వరకు వెయ్యి వరకు స్లాబ్స్ పూర్తవుతాయని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బేస్ మెంట్, గోడలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ప్రతి సోమవారం నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 53.64 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది.
జీహెచ్ఎంసీలో టవర్లు
రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎంసీతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో సొంత జాగా, ఇండ్లు లేని పబ్లిక్ లక్షల్లో ఉన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 10,66,953 మంది అప్లై చేసుకోగా ఇందులో సొంత జాగా ఉన్నవాళ్లు 18 వేల మంది మాత్రమే ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. అలాంటి వారి కోసం సర్కారు భూముల్లో జీ ప్లస్ 3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ ఆ వివరాలను హౌసింగ్ అధికారులుకు అందజేశారు. ఆయా చోట్ల జీ ప్లస్ 3 మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్క ఎకరా పరిధిలో 300 ఇళ్లు నిర్మించాలని హౌసింగ్ ఆఫీసర్లు నిర్ణయించారు. అంతకుమించి నిర్మిస్తే మౌలిక వసతులకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు.
దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు పంపాలని కలెక్టర్లకు హౌసింగ్ ఉన్నతాధికారులు ఇప్పటికే లేఖ రాశారు. ఈ వివరాలు వచ్చిన తర్వాత కేబినెట్ లో తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకు పోతామని అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీలో టవర్లు కట్టనున్న ప్రాంతాలు, నియోజకవర్గాలు
షేక్ పేట (ఖైరతాబాద్), హిమాయత్ నగర్ (ముషీరాబాద్), సైదాబాద్ (యాకుత్ పుర, మలక్ పేట) ఆసిఫ్ నగర్ (కార్వాన్, గోషామహాల్, నాంపల్లి) మారేడ్ పల్లి (సికింద్రాబాద్), తిరుమలగిరి (కంటోన్మెంట్), బండ్లగూడ (చాంద్రాయణగుట్ట).
రెండో దశలో ఇళ్ల పనులు స్టార్ట్
రాష్ట్రంలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4. 5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 71 వేల ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 47 వేల ఇళ్లను కలెక్టర్లు సాంక్షన్ చేశారు. రెండో దశలో 2.08 లక్షల ఇళ్లను సాంక్షన్ చేయగా ఇప్పటి వరకు లక్ష ఇళ్లకు పునాదులు స్టార్ట్ అయ్యాయి. దశల వారీగా రెండో విడత లబ్ధిదారులకు కలెక్టర్లు ఇళ్లను సాంక్షన్ చేస్తున్నారు.
లబ్ధిదారులకు ఇసుక రీచ్‌ల ద్వారా ఫ్రీగా ఇసుక సరఫరా చేస్తుండగా మార్కెట్ రేటు కన్నా తక్కువకు సిమెంట్, ఐరన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల సిమెంట్, ఐరన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై మార్కెట్ రేటు కన్నా తక్కువకు ఇవ్వాలని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుందని అధికారులు చెప్పారు.