ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో మంటలు .. ఓ కార్మికుడి గాయాలు, హాస్పిటల్ కు తరలింపు

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో మంటలు .. ఓ కార్మికుడి గాయాలు, హాస్పిటల్ కు తరలింపు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామశివారులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో సోమవారం ప్రమాదం జరిగింది. కంపెనీలోని పీఆర్డీసీ సెక్షన్-2 బిల్డింగ్ లో ప్రొడక్షన్ మిన్సింగ్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అదే బిల్డింగ్ లో విధులు నిర్వర్తిస్తున్న తాళ్లగూడెం గ్రామానికి చెందిన కుచ్చుల బాలరాజుకు స్వల్ప గాయాలు అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

 అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కార్మికుడి చేతులు, ముఖానికి స్వల్పంగా కాలిన గాయాలు కావడంతో భువనగిరి ఏరియా హాస్పిటల్ లో ఫస్ట్ అయిడ్ చేసి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించినట్లు కంపెనీ హెచ్ఆర్ డిప్యూటీ మేనేజర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. కార్మికుడు బాలరాజుకు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని యశోద డాక్టర్లు స్పష్టం చేశారని తెలిపారు. 

'ప్రీమియర్' కంపెనీలో తరచూ ప్రమాదాలు..

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో.. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళన చెందుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 4న పేలుడు సంభవించి ఓ కార్మికుడు చనిపోగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఏప్రిల్ 29న కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ప్లాంట్ లో సంభవించిన భారీ పేలుడు ధాటికి ముగ్గురు చనిపోయారు.