
- పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్‍కు రూ.50 లక్షల వర్క్స్
- నగరాన్ని ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత చర్యలు
- గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగులో మేయర్ గుండు సుధారాణి
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అభివృద్ధికి రూ.139.29 కోట్ల పనులకు ఆమోదం తెలిపినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సోమవారం మేయర్ సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్ పాల్గొన్నారు. గ్రేటర్ పనులకు రూ.62.15 కోట్ల జనరల్ ఫండ్స్ తో అంచనాలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఒక్కో డివిజన్‍కు రూ.50 లక్షల చొప్పున 66 డివిజన్లకు రూ.33 కోట్లు, ఇతర పనులకు రూ.24.05 కోట్లు, హంటర్‍రోడ్‍లోని 12 మోరీల జంక్షన్ డెవలప్‍మెంట్‍కు రూ.2 కోట్లు, వీధి దీపాలకు రూ.2 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.18.18 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సర్కారు విడుదల చేసిన స్టాంపు డ్యూటీ నిధులతో డివిజన్లకు రూ.41.56 కోట్లు, భద్రకాళి చెరువులో మ్యూజికల్ లైటింగ్‍కు రూ.13.50 కోట్లు, అమృత్ 2.0 పథకం ద్వారా రూ.14 కోట్ల ఎస్‍సీఎం నిధుల్లో.. రూ.06 కోట్లు ఆస్తి పన్ను అసైస్మెంట్లపై సర్వే, రూ.4 కోట్లతో స్మార్ట్ నీటి సరఫరా మెషీన్లు, మరో రూ.4 కోట్లతో నిల్వ వ్యర్థాల శుద్ధీకరణకు కేటాయించినట్లు చెప్పారు.
నగరంలో 45 లోతట్టు ప్రాంతాలను గుర్తించి.. ముంపు ముప్పు నుంచి కాపాడేందుకు శాశ్వత పనులు, ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రేటర్‍లో 35 ప్రధాన నాలాలు, డివిజన్లలోని 340 ప్రధాన అంతర్గత నాలాల్లో పూడికతీత చేపట్టామన్నారు. బల్దియాలో 15.50 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జీడబ్ల్యూఎంసీ అభివృద్ధికి రూ.173 కోట్లు ఇచ్చిన సీఎం రేవంత్‍రెడ్డికి మేయర్, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు.
‘డబుల్’ ఇండ్ల అక్రమాల్లో బీఆర్‍ఎస్ నేతలపై పీడీ యాక్ట్..
హనుమకొండలో డబుల్ బెడ్‍రూం ఇండ్ల పేరుతో వసూళ్లకు పాల్పడిన బీఆర్‍ఎస్ నేతలపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వినయ్‍భాస్కర్ నగరంలో అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం విలీన గ్రామాల్లో అభివృద్ధికి కార్పొరేషన్ బడ్జెట్‍లో 1/3 వంతు నిధులు కేటాయించాలన్నారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న విలీన గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటికల్లో సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం బల్దియా మెయిన్ ఆఫీస్‍లో పునరుద్ధరించిన కౌన్సిల్ హాల్‍ను మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కౌన్సిల్ మీటింగ్‌ను బీఆర్‍ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించి వెళ్లిపోయారు.