కరోనా సాయం కాజేసిన మినిస్టర్​కు 12 ఏండ్లు జైలు

కరోనా సాయం కాజేసిన మినిస్టర్​కు 12 ఏండ్లు జైలు

జకర్తా: కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి తెచ్చిన పథకంలోనూ ఓ మంత్రి అవినీతికి పాల్పడ్డడు. పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డడు. దీంతో కోర్టు ఆయనకు ఏకంగా పన్నెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇండోనేసియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా కారణంగా పనుల్లేక, తినడానికి తిండిలేక గోస పడుతున్న జనాలను ఆదుకోవడానికి ఇండోనేసియా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. సోషల్​ అఫైర్స్ మినిస్టర్​ జులియారి పీటర్​ బాతుబారా ఈ పథకాల అమలు వ్యవహారాలు చూసుకున్నారు. పథకాల అమలులో బాతుబారా అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తడంతో అక్కడి కరప్షన్​ఎరాడికేషన్​ కమిషన్( మన అవినీతి నిరోధక శాఖ లాంటిది) అధికారులు ఆయనపై నిఘా పెట్టారు. గత ఏడాది  డిసెంబర్​లో బాతుబారా లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డడు. దీంతో పదవి నుంచి వెంటనే దిగిపోవాలని కరప్షన్​ ఎరాడికేషన్​ కమిషన్​ చైర్మన్​ బాతుబారాను ఆదేశించారు. ఆపై ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. విచారణలో బాతుబారా లంచం తీసుకున్నట్లు తేలడంతో కోర్టు ఆయనకు 12 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు 500 మిలియన్ల రూపయ్య(మన రూపాయల్లో 25 లక్షలకు పైగా) జరిమానా కట్టాలని ఆదేశించింది.