పాట పాడి పోలీసుల్లో స్ఫూర్తి నింపిన ఇండోర్​ ఐజీ

పాట పాడి పోలీసుల్లో స్ఫూర్తి నింపిన ఇండోర్​ ఐజీ

ఇండోర్: మధ్యప్రదేశ్​లో హాట్​ స్పాట్​గా మారిన సిటీ ఇండోర్. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో వైరస్​ ను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసుల్లో స్ఫూర్తి నింపడానికి ఇండోర్​ సిటీ పోలీస్​ చీఫ్ ఏకంగా పాటపాడారు. వారు ఇప్పటి వరకూ చేసిన సేవలను గుర్తు చేస్తూ మరింత సమర్థంగా పనిచేసేలా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇండోర్ జోన్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ వివేక్​ శర్మ ‘‘హమ్​ హోంగే కాంయాబ్(మనం దీనిని అధిగమిస్తాం)”అంటూ ఈ పాట పాడారు. ‘‘ఈ సాంగ్​ మనందరికీ ఒక మంచి సందేశం. మనం కలిసి పోరాటం చేస్తే విజయం సాధిస్తాం. కరోనా వైరస్​కు భయపడొద్దు. ఈ పోరాటంలో మనం కింద పడినా.. మరొకరిని కిందపడకుండా కాపాడదాం. మనం ఇలాగే పోరాటం చేస్తే విజయం మనదే. ఈ చాలెంజ్​నే మనం ఒక అవకాశంగా తీసుకుందాం. సానుకూల ధృక్ఫథంతో ఉండండి.. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ప్రతి రోజు మనం కలుస్తాం. మీరు పడుతున్న కష్టానికి నా సెల్యూట్”అంటూ తన టీమ్​ మెంబర్లను ఉద్దేశించి వివేక్​ శర్మ అన్నారు. 1960ల్లో అమెరికాలో పౌర హక్కులకు సంబంధించి జరిగిన ఆందోళనల్లో ‘‘వుయ్​ షల్​ ఓవర్​కమ్”అనే పాట చాలా పాపులర్​ అయ్యింది. దానిని హమ్​ హోంగే కాంయాబ్​ అంటూ హిందీ కవి గిరిజాకుమార్​ మాధుర్​ అనువాదం చేశారు. మరో వీడియోలో వివేక్​ శర్మ పాటను తమ హెడ్​ సెట్లలో విన్న మరికొందరు పోలీసులు.. ఆయనతో పాటు తాము కూడా పాట పాడారు. ఇండోర్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివేక్​ శర్మ తన సిబ్బందికి సూచించారు. అలాంటి వారిపై బలప్రయోగం చేయకుండా.. వారితో ఎండలో పని చేయించాలని.. దానిని వీడియో తీసి.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయాలని చెప్పారు. దాని వల్ల ఇంకెవరూ లాక్​డౌన్​ను ఉల్లంఘించరని చెప్పారు. మధ్యప్రదేశ్​లో మొత్తం 562 కేసులు నమోదైతే.. అందులో ఇండోర్​లో రిపోర్ట్​ అయినవే 311 కేసులు. రాష్ట్రంలో కరోనాతో 41 మంది చనిపోతే ఇండోర్​లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.