
- ఈనెల 25లోపు ఇవ్వకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తాం
నిర్మల్, వెలుగు : డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అదనపు సౌకర్యాలు కల్పించకుండా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ పరిధి సిద్దాపూర్ లోని డబుల్ ఇండ్ల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజకీయ దురుద్దేశంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటు న్నారని మండిపడ్డారు.
డబుల్ ఇండ్ల పంపిణీ కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఎమ్మెల్యే పరోక్షంగా పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఈనెల25 లోగా డబుల్ ఇండ్ల పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందిచాలని, లేదంటే మరుసటి రోజు నుంచి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈలోపు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ కౌన్సిలర్, గజేందర్, పీసీ మాజీ సభ్యుడు రామలింగం, ఎస్సీ సెల్ నేత ముడుసు సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంద్రకరణ్ రెడ్డి తీరు హాస్యాస్పదం
కాంగ్రెస్ లో తన ఉనికిని కాపాడుకునేందుకు మాజీ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జ్ రావుల రామనాథ్ మండిపడ్డారు. సిద్దాపూర్ లోని డబుల్ ఇండ్ల ను బీజేపీ నేతలు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అభివృద్ధి పనులను, జనాదరణను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.
సిద్దాపూర్ డబుల్ ఇండ్లను నెల రోజుల్లో పేదలకు పంపిణీ చేయకుంటే పదివేల మందితో బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిసమ్మ రాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తక్కల రమణ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్ తదితరులు ఉన్నారు.