సింధు జలాల ఒప్పందం ఒక చారిత్రక తప్పిదం: ఎల్జీ సిన్హా సంచలన వ్యాఖ్యలు

సింధు జలాల ఒప్పందం ఒక చారిత్రక తప్పిదం: ఎల్జీ సిన్హా సంచలన వ్యాఖ్యలు

శ్రీనగర్: సింధు జలాల ఒప్పందంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం (జూలై 19) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందం ఒక ‘చారిత్రక తప్పిదం’ అని అభివర్ణించారు. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేసి ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‎కు భారత్ తగిన బుద్ధి చెప్పిందన్నారు. సింధూ జలాల ఒప్పందం రద్దు వల్ల జమ్మూ కాశ్మీర్‎కు అపారమైన ప్రయోజనం చేకూరుతుందని, కాశ్మీర్ పూర్తి స్థాయిలో జల విద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతోందన్నారు. 

రక్తం,  నీరు కలిసి ప్రవహించలేవని.. అలాగే ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి జరగవని ఈ ఒప్పందం ద్వారా భారత్ నిరూపించిందని పేర్కొన్నారు. భారత్ నీరు ఇప్పుడు భారత్ లోనే ప్రవహిస్తోందని..  సింధు జలాల ఒప్పందం రద్దుతో ఇప్పుడు జీలం, చీనాబ్ నదులపై మనం పూర్తి నియంత్రణను కలిగి ఉన్నామన్నారు. 

ఈ ఒప్పందం నిలిపివేయడంతో జమ్మూలోని బంజరు ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చని, జమ్మూ కాశ్మీర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కొత్త ఊపు వస్తుందని సిన్హా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు భారత్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్లాంట్లు, కొత్త ప్రాంతాలకు నీటి మళ్లింపుపై దృష్టి పెడుతుందని.. తద్వారా సింధు నీటిని ఉపయోగించుకుని కొత్త జలాశయాల నిర్మాణానికి అడుగులు పడతాయని పేర్కొన్నారు. 

కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పర్యాటక ప్రదేశం పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది చనిపోయారు. ఈ దాడితో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్ పై భారత్ కన్నెర్ర జేసింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ తో ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు  చేసుకుని దాయాది దేశాన్ని చావు దెబ్బకొట్టింది భారత్.