10 ఏళ్లుగా ఇండస్ఇండ్ బ్యాంకు లెక్కల్లో అవకతవకలు.. బాంబు పేల్చిన మాజీ అధికారి

10 ఏళ్లుగా ఇండస్ఇండ్ బ్యాంకు లెక్కల్లో అవకతవకలు.. బాంబు పేల్చిన మాజీ అధికారి

హిందూజా గ్రూప్ కి చెందిన ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ గడచిన కొన్ని నెలలుగా అనేక ఆరోపణలను ఎదుర్కొంటోంది. బ్యాంకులో జరిగిన కొన్ని అకౌంటింగ్ అవతవకల వ్యవహారాలు బయటకు రావటం.. అలాగే కొన్ని పెట్టుబడి నష్టాల గురించి కంపెనీనే స్వయంగా గుర్తించినట్లు బయటకు చెప్పిన నాటి నుంచి పెట్టుబడిదారుల్లో కంపెనీపై నమ్మకం సడలిపోయింది. 

ఈ క్రమంలోనే బ్యాంకు మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గోవింద్ జైన్ చేసిన ప్రకటన కంపెనీని కుదిపేస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో 10 ఏళ్లుగా అకౌంటింగ్ అవకతవకలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ అవకతవకలు 2015 నుంచే కొనసాగుతున్నాయని.. అప్పటి బోర్డు, సీనియర్ మేనేజ్‌మెంట్, మాజీ ఫైనాన్స్ చీఫ్ SV జరేగాంకర్‌కు వీటికి సంబంధించిన వివరాలు తెలుసని  జైన్ ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం వద్ద ఆరోపించారు. 

ఈ క్రమంలో ఆయన ఫిర్యాదులో రాజీనామా లేఖలతో పాటు అనేక పత్రాలను సమర్పించారు. దీని దర్యాప్తు కోసం ఇండిపెండెంట్ ఆడిటర్ ను నియమించాలని అప్పట్లో తాను కంపెనీ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియాను అనేకమాట్లు కోరినట్లు ఫిర్యాదులో చెప్పారు జైన్. అలాగే చట్టప్రకారం సంబంధిత ఏజెన్సీలకు కూడా ఫిర్యాదులు అందించినట్లు చెప్పారు. 

మెుదటిసారిగా గోవింద్ జైన్ జూన్ 11, 2024లో తన రాజీనామాను అందించారు. ఆ తర్వాత జూన్ క్వార్టర్లీ ఫలితాలపై తాను సంతకం చేయబోనని కూడా స్పష్టంగా ప్రకటించారు. అయితే అప్పట్లో సీఈవో గోవింద్ రాజీనామాను నిలిపివేయటంతో రెండవసారి ఆగస్టు 20, 2024లో రాజీనామా లేఖను కంపెనీకి పంపినట్లు చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబర్ 29, 2024న స్వతంత్ర ఆడిట్ అవసరమని లేకుంటే బ్యాంకుకు భారీ ఆర్థిక నష్టం ఏర్పడుతుందని కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల తర్వాత జనవరి 17, 2025లో గోవింద్ జైన్ రాజీనామాను ఇండస్ఇండ్ బ్యాంక్ ఆమోదించింది. 

ALSO READ : ఐఫోన్ 17కి మించి షియోమీ కొత్త సిరీస్..

ఆ తర్వాత మార్చి 2025లో కంపెనీ డెరివేటివ్ లావాదేవీల్లో రూ.వెయ్యి 577 కోట్లు నష్టం వచ్చిందని.. దాని అకౌంటింగ్ లో తప్పులు దొర్లాయని బ్యాంక్ ప్రకటించింది. దీంతో మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత రూ.2వేల కోట్ల నష్టాన్ని నివేదించింది. ఈ క్రమంలోనే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సమయంలో సీఈవో కథ్పాలియా రూ.134 కోట్లు, మాజీ డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా రూ.82 కోట్ల విలువైన వాటాలను విక్రయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.