ఏమక్కా నువ్ మారవా..! సెహ్వాగ్‌ను మించిపోయిన భారత మహిళా కెప్టెన్

ఏమక్కా నువ్ మారవా..! సెహ్వాగ్‌ను మించిపోయిన భారత మహిళా కెప్టెన్

వీరేంద్ర సెహ్వాగ్.. ఈ పేరు వినబడగానే అందరికీ గుర్తొచ్చేది అతని విధ్వంసం. ఎదుర్కున్న తొలి బంతిని కూడా బౌండరీకి తరలించాలనే అతనిలోని తపన. ఇప్పుడంటే టీ20 ఫార్మాట్ వల్ల ధనాధన్ మెరుపులు మొదల్యయ్యాయి కానీ, ఒకప్పుడు టీ20 క్రికెట్ పురుడు పోసుకోకముందే తన దూకుడైన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులకు ఆ మజాను పంచినవాడు మన  వీరేంద్రుడు. ఎదుట ఉన్నది ఎంతంటి బౌలరైనా అతన్ని భయపెట్టడం మన నజఫ్‌గడ్ నవాబు ఒక్కడికే చెల్లింది. అయితే అతనిలో కొందరికి నచ్చనిది.. లేజీనెస్. 

అలవోకగా బౌండరీలు బాదే మన వీరేంద్రుడికి వికెట్ల మధ్య పరుగులు తీయడమంటే చిరాకు. అంతెందుకు కుదురుగా క్రీజులో నిల్చోవాలన్నా బద్ధకం. గతంలో(2007) విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్ లో సెహ్వాగ్ ఆ బద్ధకం కారణంగానే రనౌట్ అయ్యాడు. ఏముందిలే అన్నట్లు వికెట్ల మధ్య పరుగెత్తడమే కాకుండా సరైన సమయానికి క్రీజులో బ్యాట్ పెట్టకుండా తచ్చాడాడు. అతని సోమరితనాన్ని ముందే ఊహించిన అప్పటి లంక వికెట్ కీపర్ కుమార సంగార్కర వికెట్లను గురిపెట్టి కొట్టడంతో పెవిలియన్ బాట పట్టాడు. అచ్చం అదే తరహాలో భారత క్రికెట్ జట్టు మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇవాళ రనౌట్‌గా వెనుదిరిగింది.

ముంబై వేదికగా ఇంగ్లాండ్, భారత మహిళా జట్లు తలపడుతున్నాయి. ఈ  మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఊహించని రీతిలో రనౌట్ అయ్యింది. బంతిని మిడ్ ఆఫ్ వైపుగా ఆడిన హర్మన్‌ప్రీత్ పరుగు కోసం ప్రయత్నించింది. కానీ వెంటనే పరుగు లేదని గ్రహించి క్రీజులోకి రావడానికి యత్నించింది. ఆ ప్రయత్నంలో కాస్త బద్ధకంగా వ్యవహరించడంతో రనౌట్ రూపంలో వెనుదిరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఈ విధంగా ఔట్ కావడం ఇది మొదటిసారి కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన 2023 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లోనూ ఇలానే  అవుట్ అయ్యింది.

అచ్చం సెహ్వాగ్‌ శైలి

భారత జట్టుకు సెహ్వాగ్ ఎలాగో భారత మహిళా జట్టుకు హర్మన్ ప్రీత్ అలానే. జట్టు భారీ స్కోర్ చేయాలన్నా, భారీ లక్ష్యం నిర్ధేశించాలన్నా అక్కడ వీరేంద్రుడు.. ఇక్కడ ఆమె బ్యాట్ ఝుళిపించాల్సిందే. అలాంటిది ఇప్పుడు రనౌట్లలోనూ హర్మన్ అతన్నే అనుసరిస్తోందని అభిమానులు నెట్టింట హంగామా చేస్తున్నారు.