
న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిషా ప్రియ మరణ శిక్ష వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం, భారత గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబక్కర్ చర్చలు సఫలం కావడంతో యెమెన్ ప్రభుత్వం నిమిషా ప్రియ ఉరి శిక్షను శాశ్వతంగా రద్దు చేసిందని సోషల్ మీడియా, జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరణ శిక్ష రద్దు అయినట్లు అబూబక్కర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఉరి శిక్ష రద్దు అయినట్లు ఊహాగానాలు ఊపందుకోవడంతో భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిషా ప్రియ మరణ శిక్ష రద్దు అయినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఎంఈఏ వర్గాలు ఖండించాయి. నిమిషా ప్రియ కేసుపై కొంతమంది వెల్లడిస్తోన్న సమాచారం తప్పని భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. నిమిషా ప్రియ మరణ శిక్ష రద్దును కేంద్రం ధృవీకరించలేదు. దీంతో నిమిషా ప్రియ వ్యవహారంలో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఆమెకు ఉరి శిక్ష విధిస్తారా..? లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
యెమెన్ పౌరుడి హత్య కేసులో నిమిషా ప్రియ మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ, కాంతపురం ఏపీ అబూబక్కర్ కార్యాలయం సోమవారం (జూలై 28) ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో సస్పెండ్ చేయబడిన నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేశారని.. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని యెమెన్ అధికారులు నిర్ణయించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన ఆధారంగా నిమిషా ప్రియ ఉరి శిక్ష రద్దు అయినట్లు ప్రచారం జరగగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిమిషా ప్రియ మరణ శిక్ష రద్దు కాలేదని.. ఆమె విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది.