దూసుకెళ్తున్న ఇన్ఫ్రా సెక్టార్... వెల్లడించిన కేర్ఎడ్జ్ రిపోర్ట్

దూసుకెళ్తున్న ఇన్ఫ్రా సెక్టార్... వెల్లడించిన కేర్ఎడ్జ్  రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు: మనదేశ  ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్టార్ దూసుకెళ్తోందని కేర్​ఎడ్జ్​ రేటింగ్​ తాజా రిపోర్ట్​ వెల్లడించింది. భౌగోళిక,- రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ, రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్​ వంటి రంగాలతో పాటు డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్​ వంటి కొత్త రంగాల్లో కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా సాగుతోందని పేర్కొంది. దీని రిపోర్ట్​ ప్రకారం..ప్రభుత్వ గతి శక్తి, నేషనల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ వంటి పథకాల కారణంగా ఈ రంగం జీడీపీని భారీగా పెంచుతుంది. 2030 నాటికి దేశ జనాభాలో 42 శాతం మంది పట్టణాల్లో నివసిస్తారు. 

హైవేల నిర్మాణం 2026 ఆర్థిక సంవత్సరంలో 7-–10 శాతం తగ్గుతుందని అంచనా.  టోల్ రోడ్లపై వాహనాల రాకపోకలు మాత్రం 7 శాతం పెరుగుతాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి హైబ్రిడ్​ యాన్యుటీ మోడల్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన రాబడి వచ్చే అవకాశం ఉంది. విమాన  ప్రయాణీకుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం నుంచి 2027 ఆర్థిక సంవత్సరం మధ్య 7 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్​)తో పెరుగుతుందని అంచనా. 

నౌకాశ్రయాల్లో కార్గో రద్దీ 2026 ఆర్థిక సంవత్సరంలో  కేవలం 2 శాతం మాత్రమే పెరుగుతుంది. కంటెయినర్​ కార్గో మాత్రం 8 శాతం బలమైన వృద్ధిని నమోదు చేయవచ్చు. విద్యుత్​ రంగంలో పునరుత్పాదక శక్తి వృద్ధికి దారితీస్తోంది. సౌరశక్తి, గాలి నుంచి వచ్చే విద్యుత్​ 2025 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం నుంచి 2030 నాటికి 35 శాతానికి పైగా పెరుగుతుంది.  గ్రీన్ హైడ్రోజన్,  డేటా సెంటర్లు లాంటి కొత్త రంగాల్లో రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని  కేర్​ పేర్కొంది.