ఉద్యోగాల కోసం.. ప్రతి మంగళవారం దీక్ష

ఉద్యోగాల కోసం.. ప్రతి మంగళవారం దీక్ష
  • వైఎస్ఆర్‌‌‌‌టీపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: ‘‘బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ కావాలె. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ నిరుద్యోగులు చనిపోతున్నా పాలకులు మారటం లేదు. ఇంకెంత మంది చనిపోతే మారతారు?” అంటూ రాష్ట్ర సర్కార్‌పై వైఎస్ఆర్‌టీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఇప్పటినుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగుల తరఫున దీక్ష చేస్తామని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబసభ్యులను ప్రతి వారం పరామర్శిస్తామని ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో పార్టీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న మీడియాతో మాట్లాడారు. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల నిరాహార దీక్ష చేస్తే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అయినా 3 రోజులు దీక్ష చేశామని ఇందిరా శోభన్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది జాబ్ ల కోసం కాదా? అని ప్రశ్నించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు నిరుద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటిస్తున్నారని, కానీ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వటం లేదని పిట్టా రాంరెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పిస్తామని ఏపూరి సోమన్న చెప్పారు.