మెడ నుంచి అరికాళ్ల దాకా ఒళ్లంతా దెబ్బలే

మెడ నుంచి అరికాళ్ల దాకా ఒళ్లంతా దెబ్బలే
  • ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్‌‌‌‌‌‌‌‌ 
  • వీపు నిండా తీవ్రంగా కొట్టిన గుర్తులు
  • గాయాలతో నడవలేకపోతున్న బాధితుడు.. కూర్చోవడానికి కూడా అవస్థలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ లాకప్ డెత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దొంగతనం కేసులో మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్‌‌‌‌‌‌‌‌ను కూడా పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నా మెడ నుంచి అరికాళ్ల దాకా శరీరమంతా గాయాలయ్యాయి. పోలీసుల చిత్రహింసల వల్ల బాధితుడు నడవలేకపోతున్నాడు. కూర్చోడానికీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మరియమ్మ భర్త మూడేళ్ల క్రితం చనిపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో పాస్టర్ బాలశౌరి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తోంది. మూడు వారాల క్రితం తన ఇంట్లో రూ. 2 లక్షలు పోయాయని పోలీసులకు బాలశౌరి ఫిర్యాదు చేశారు. దీంతో అడ్డగూడూరు పోలీసులు మరియమ్మతో పాటు ఉదయ్‌‌‌‌‌‌‌‌ను విచారించారు. మరియమ్మ కూతురునూ చింతకాని పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఒక రోజు రాత్రి మొత్తం చిత్రహింసలు పెట్టారని బాధితులు చెబుతున్నారు. చింతకాని, అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లతో పాటు తమ సొంతూర్లో గ్రామస్తుల ముందే తల్లిని, తమను పోలీసులు చితకబాదారని ఉదయ్ చెబుతున్నాడు. పోలీసుల చిత్రహింసలకు ఈ నెల 17న మరియమ్మ చనిపోగా పోలీసులు విడిచిపెట్టడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉదయ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నాడు. 

బాధితుడిని పరామర్శించిన బీజేపీ నేతలు
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఉదయ్ కిరణ్‌‌‌‌‌‌‌‌ను బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పరామర్శించారు. బాధితుడికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాషా మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్ పాలనలో ఓ దళిత మహిళను లాకప్ డెత్ చేసి ఆమె కుటుంబీకులను చిత్ర హింసలకు గురిచేయడం అమానుషమన్నారు. మరియమ్మ చనిపోయిన తర్వాత కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. వాళ్లను పశువులను కొట్టినట్లు ఎందుకు కొట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. ఉదయ్​ కిరణ్‌‌‌‌‌‌‌‌కు బీజేపీ అండగా ఉంటుందన్నారు. చింతకాని మండలం కోమట్లగూడెంలో మరియమ్మ కుటుంబీకులను పరామర్శించారు. బీజేపీ అండగా ఉంటుందని మరియమ్మ కూతురుకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాజు, జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షుడు సుదర్శన్ పాల్గొన్నారు.

మగ పోలీసులే మా అమ్మను కొట్టి చంపిన్రు 
అమ్మను, తమ్ముడిని అడ్డగూడూరు పోలీసులు చిత్రహింసలు పెట్టారు. రెండు వారాల కిందట మా సొంతూరికి వచ్చి అమ్మను, తమ్ముడిని తీసుకెళ్లారు. మా కళ్ల ముందే అమ్మపై మగ పోలీసులు చేయి చేసుకున్నారు. ముగ్గురు పోలీసులు కర్రలతో అమ్మను, తమ్ముడిని విపరీతంగా కొట్టారు. వద్దని కాళ్లా వేళ్లా పడ్డా వినలేదు. తెల్లవారుజాము వరకు బాగా కొట్టి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. పోలీసు దెబ్బలతోనే మా అమ్మ చనిపోయింది. తమ్ముడిని కూడా పోలీసులు చంపేస్తారని భయపడ్డా. అమ్మ చనిపోయాక తమ్ముడ్ని విడిచిపెట్టారు.
- మరియమ్మ కూతురు

ఇసుక మాఫియా చేతిలో చనిపోయినోళ్లకూ ఇట్లే ఇయ్యాలె
త్వరలో జరగబోయే హుజూరాబాద్​ ఎన్నికల్లో లబ్ధి కోసమే మరియమ్మ కుటుబానికి కేసీఆర్​ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన దళితుల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీస్​ స్టేషన్​లో చనిపోయిన మరియమ్మ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టే సిరిసిల్ల, మహబూబ్​నగర్​ జిల్లాల్లో ఇసుక మాఫియా చేతిలో చనిపోయిన దళిత కుటుంబాలకూ ప్యాకేజీ ఇవ్వాలి.  
- వివేక్​ వెంకటస్వామి, బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు