
హైదరాబాద్, వెలుగు: మహిళల అంతర్గత మనోభావాలు, మనోధైర్యాన్ని ప్రధాన అంశాలుగా తీసుకుని వారి నుంచి పొందిన స్ఫూర్తి ఆధారంగా "ఇన్నర్ కాళీ" అనే ప్రత్యేక థీమ్‌తో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆర్టిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, పోయెట్ వెంకట్ గడ్డం తెలిపారు. బంజారాహిల్స్ లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీ లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం మంగళవారం బంజారాహిల్స్ లోని నవ క్లినిక్ లోని వెంకట్ స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళీమాత పవర్, మహిళల నుంచి తీసుకున్న స్ఫూర్తి, స్ట్రెంత్, ప్యాషన్ కలయికతో తన ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఇన్నర్ కాళీ అనే పేరును పెట్టానని తెలిపారు. తన ప్రతి పెయింటింగ్ మనుషుల కథని ప్రతిబింబించేలా ఉంటుందన్నారు.
తాను గీసే పెయింటింగ్స్‌లో ఆర్ట్ తో పాటు పోయెట్ రూపంలో వివరాలను కూడా రాసిపెడ్తానని చెప్పారు. ఎగ్జిబిషన్ లో ఆక్రెలిక్ కలర్స్ తో వేసిన 36 పెయింటింగ్స్ ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. వాటితో పాటు తాను యూనిక్‌గా క్రియేట్ చేసిన క్లాత్ ఆర్ట్ డిజైనర్‌వేర్ ని కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. హ్యుమన్ స్టోరీస్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ని దుస్తుల మీద ఆర్ట్ రూపంలో చూపిస్తున్నానని వివరించారు. వీటితో పాటు ప్రదర్శనలో డిజిటల్ కొలాబ్, ఫ్యాషన్ ఇన్‌స్టాలేషన్, డ్రాయింగ్స్ వంటివి ఉంటాయన్నారు.