హైకోర్టులో జాగీర్​ భూములపై విచారణ

హైకోర్టులో జాగీర్​ భూములపై విచారణ
  • నోటీసులు మళ్లీ ఎలా ఇస్తరు?
  • హైకోర్టులో జాగీర్​ భూములపై విచారణ
  • ప్రభుత్వ అప్పీల్‌‌ను కొట్టేయాలన్న రైతులు

హైదరాబాద్, వెలుగు :  శంషాబాద్‌‌ మండలం సుల్తాన్‌‌పల్లిలోని 300 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను గతంలో హైకోర్టు కొట్టేస్తే.. ఇప్పుడు ప్రభుత్వాధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారని వి.తులసీదాస్‌‌తో పాటు ఇతరులు హైకోర్టుకు విన్నవించారు. రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లే ఉన్నాయని, పట్టాదారు పాస్‌‌ పుస్తకాలు కూడా ఉన్నాయని, ఇప్పుడు ఆ భూములపై అధికారులు నోటీసులు జారీ చేయడం అన్యాయమని పిటిషనర్ల తరఫు సీనియర్‌‌ అడ్వకేట్​ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను హైకోర్టు కొట్టేసిందని, భూమి హక్కుల వివాదాన్ని సివిల్‌‌ కోర్టులో తేల్చుకోవాలంటూ.. సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని, ప్రభుత్వం వేసిన అప్పీల్‌‌ పిటిషన్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ నందలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. సుల్తాన్‌‌పల్లిలోని సర్వే నెం 123 నుంచి 126, 143 నుంచి 150, 152 ఏ, బీ, 153,154ల్లోని రూ.800 కోట్ల విలువైన 300 ఎకరాల జాగీర్‌‌ భూములు ప్రభుత్వానివేనని చెప్పారు. 1951లోనే జాగీర్‌‌దారులకు ప్రభుత్వం రూ.60 వేల పరిహారం ఇచ్చిందన్నారు. జాగీర్‌‌దార్‌‌ యాక్ట్‌‌ రద్దు అయినందున అవి ప్రభుత్వ భూములేనని చెప్పారు. దీంతో విచారణను ఈనెల చివరికి వాయిదా వేస్తున్నట్టు బెంచ్​ ప్రకటించింది.