ఇయ్యాల స్పేస్​లోకి ఇన్​శాట్-–3డీఎస్’

ఇయ్యాల స్పేస్​లోకి  ఇన్​శాట్-–3డీఎస్’
  •  జీఎస్ఎల్వీ-ఎఫ్14 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ 
  • సాయంత్రం 5.35కు స్పేస్​లోకి భూపరిశీలక ఉపగ్రహం

శ్రీహరికోట/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఇన్ శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు చేపట్టిన జీఎస్ఎల్వీ‌‌=ఎఫ్14 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం రాత్రి 9 గంటలకు 27.5 గంటల కౌంట్ డౌన్ షురూ చేసింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ (ఇన్ శాట్)లో భాగంగా ప్రస్తుతం అంతరిక్షంలో ఇన్ శాట్=3డీ, ఇన్ శాట్=3డీఆర్ అనే రెండు థర్డ్ జనరేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. 

వీటికి కొనసాగింపుగా ఇన్ శాట్=3డీఎస్ ను ఇస్రో ప్రయోగిస్తోంది. దీనిలో ‘6 చానెల్ ఇమేజర్’, ‘19 చానెల్ సౌండర్, ‘డాటా రిలే ట్రాన్స్ పాండర్’, ‘సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్ పాండర్’ అనే పేలోడ్లు ఉన్నాయి. ఇది స్పేస్​లోకి చేరితే వాతావరణ అంచనా, విపత్తుల నిర్వహణ అంశాల్లో ఇండియా కెపాసిటీ మరింతగా పెరగనుంది.

కార్టోశాట్-2 కథ ముగిసింది.. 

ఇస్రో పదిహేడేండ్ల కిందట అంతరిక్షానికి పంపిన భూపరిశీలక ఉపగ్రహం కార్టోశాట్‌‌-‌‌‌‌--–2 కథ ముగిసింది. ఈ ఉపగ్రహం ఈ నెల 14న మధ్యాహ్నం 3.48 గంటలకు భూ వాతావరణంలోకి ప్రవేశించి, హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. కార్టోశాట్ సిరీస్ లో రెండోదైన ఈ ఉపగ్రహాన్ని 2007, జనవరి 10న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ7 రాకెట్ ద్వారా ప్రయోగించారు. 

ఇది 12 ఏండ్ల పాటు సేవలు అందించింది. వాస్తవానికి మిషన్ లైఫ్ ముగిసిన తర్వాత 30 ఏండ్లకు ఇది నెమ్మదిగా కక్ష్యను తగ్గించుకుంటూ భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోవాల్సి ఉంది. కానీ అంతరిక్షంలో శకలాలను తగ్గించాలన్న ఉద్దేశంతో 2020 సెప్టెంబర్ లో దీనిలో మిగిలి ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి కక్ష్యను 630 కిలోమీటర్లకు ఇస్రో తగ్గించింది. దీంతో నాలుగేండ్లలోనే ఇది గత బుధవారం భూవాతావరణంలోకి దిగి వచ్చి కూలిపోయింది.