మెడికల్‌‌ పీజీ సీట్లలో ఇన్​సర్వీస్ ​కోటా

మెడికల్‌‌ పీజీ సీట్లలో ఇన్​సర్వీస్ ​కోటా
  • ఎక్స్ పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్.. సర్కార్ కు నివేదిక
  • క్లినికల్ లో 20, నాన్ క్లినికల్ లో 40 శాతం
  • సర్కార్ దవాఖాన్లలో కనీసం రెండేండ్లు పనిచేస్తేనే అర్హత

హైదరాబాద్, వెలుగు: మెడికల్​ పీజీ సీట్ల కేటాయింపులో ఇన్​సర్వీస్​ కోటాను పునరుద్ధరించేందుకు ఎక్స్​పర్ట్​ కమిటీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. క్లినికల్​ విభాగంలో 20%, నాన్​ క్లినికల్​ విభాగంలో 40% సీట్లను ఇన్​సర్వీస్​ డాక్టర్లకు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు డీఎంఈ రమేశ్​రెడ్డి, కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ వీసీ కరుణాకర్​‌‌రెడ్డి, నిమ్స్​ డైరెక్టర్​ మనోహర్​‌‌, పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​‌‌ శ్రీనివాసరావులతో కూడిన కమిటీ రెండ్రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇన్​సర్వీస్​ కోటా అమలు సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసి నివేదిక ఇచ్చేందుకు పోయిన నెలలో హెల్త్​ సెక్రటరీ ఈ కమిటీని నియమించారు. కోటా అమలుకు సర్కార్​ పాజిటివ్​గా ఉండడంతో, 20 రోజుల్లోనే కమిటీ నివేదిక ఇచ్చింది.  మన రాష్ట్రంలో, దేశంలో 2017 వరకూ ఇన్​సర్వీస్​ కోటా ఉండేది. మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా చట్ట సవరణతో ఈ కోటా రద్దైంది. తమిళనాడు, కేరళ, గుజరాత్​ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్​ చేశాయి. ఇన్​సర్వీస్​ కోటా రాష్ట్ర పరిధిలోని అంశమని నిరుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సుమారు 11 రాష్ట్రాలు ఇన్​సర్వీస్​ కోటాను పునరుద్ధరించాయి. మన రాష్ట్రంలోనూ ఇన్​సర్వీస్​ కోటా అమలు చేయాలని రెండేండ్లుగా ప్రభుత్వ వైద్య సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. అమలు చేయొద్దని ప్రైవేటు డాక్టర్లు డిమాండ్​ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని, కోటా అమలుకే సర్కార్​ మొగ్గు చూపుతోంది. ఒకట్రెండు వారాల్లోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

క్లినికల్​లో 30 శాతం!
రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 900  పీజీ సీట్లు ఉండగా, ప్రైవేటులో 1,117 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని సగం సీట్లను నేషనల్​ పూల్‌‌కి కేటాయించి, మిగతా సగం సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని సగం సీట్లను మేనేజ్​మెంట్​ కోటాలో, మిగతా సగం సీట్లను కన్వీనర్​ కోటాలో భర్తీ చేస్తారు. క్లినికల్​ సీట్లలో 20%, నాన్​ క్లినికల్​ సీట్లలో 40% ఇన్​సర్వీస్​ కోటా కింద రిజర్వ్​ చేయాలని కమిటీ సూచించింది. గతంలో క్లినికల్​ సీట్లకు 30%, నాన్​క్లినికల్​లో 50% ఇన్​సర్వీస్​ కోటా ఉండేది. ప్రైవేటు డాక్టర్లు వ్యతిరేకిస్తుండడంతో ఆ కోటాను 10% చొప్పున తగ్గించాలని నిర్ణయించారు.

కండీషన్స్ ​అప్లై
ఇన్​సర్వీస్​ కోటా రిజర్వేషన్లు పొందడానికి కమిటీ కొన్ని సూచనలు చేసింది. ట్రైబల్​ ఏరియాలోని ప్రభుత్వ దవాఖానల్లో రెండేళ్లపాటు పనిచేసినవారు ఇన్​సర్వీస్​ కోటాలో పీజీ సీటు పొందేందుకు అర్హత ఉంటుంది. పల్లెల్లో మూడేండ్లు, పట్టణాల్లో ఆరేండ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఇన్​సర్వీస్​ కోటాకు అర్హులవుతారు. నీట్​ పీజీ ఎగ్జామ్​లో కనీసం 50% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇన్​సర్వీస్​ కోటాలో పీజీ పూర్తి అయ్యాక కనీసం ఐదేండ్లు ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తానని ముందే బాండ్​ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బాండ్​ను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించాలని కమిటీ సూచించింది. గతంలో రూ.20 లక్షలుగా ఉన్న ఈ ఫైన్‌‌ను ఈ ఏడాదినుంచి సుమారు రూ.50 నుంచి 75 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఇదీ లాభం
ప్రభుత్వ దవాఖాన్లలో రెగ్యులర్​ రిక్రూట్​మెంట్లు లేకపోవడం, టెంపరరీ పోస్టులకు అత్తెసరు జీతాలు ఇస్తుండడంతో ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్లు ఇష్టపడడం లేదు. ఇన్​సర్వీస్​ కోటాపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సర్కార్​, ఇప్పుడు సానుకూల నిర్ణయం తీసుకుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎంబీబీఎస్​ సీట్ల కంటే పీజీ సీట్లు చాలా తక్కువగాఉండడంతో, పీజీ సీటు సాధించడం చాలా కష్టంగా మారింది. దీంతో ఇన్​సర్వీస్​ రిజర్వేషన్​ కోసమైనా ఎంబీబీఎస్​ పూర్తవగానే ప్రభుత్వ సర్వీస్​లోకి వచ్చేందుకు డాక్టర్లు ఇష్టపడ్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడికొచ్చాక ఇన్​సర్వీస్​ కేటగిరీ కింద పీజీ చేస్తే, మరో ఐదేండ్లు కచ్చితంగా ప్రభుత్వ సెక్టార్​‌‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఇలా డాక్టర్లను ప్రభుత్వ దవాఖాన్లలో.. ముఖ్యంగా ఏజెన్సీ, రూరల్​ ఏరియాల్లో పనిచేయించేందుకు దోహదపడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.