
కలిసొచ్చినవాడు జీవితంలో కాస్త తొందరగా స్థిరపడతాడు. కష్టపడినవాడు కొంచెం ఆలస్యంగా స్థిరపడతాడు. ఆవుకు గడ్డి దొరికినంత తేలికగా పులికి జింక దొరకదుగా’ ఒక నానుడి వాడుకలో ఉంది. నిజమే కొందరికి అదృష్టం కలిసొస్తుంది. కొందరు కష్టపడితే కాని కలిసి రాదు.
ఇందుకు మంచి ఉదాహరణ భగీరథుడి కథ.మహాభారతం అరణ్యపర్వం తృతీయాశ్వాసంలో భగీరథుడి కథ వస్తుంది. ‘భగీరథ ప్రయత్నం’ అనే మాట తెలిసిందే. ఆ నానుడి ఎందుకు వచ్చింది అని పరిశీలిస్తే... కపిల మహర్షి కోపాగ్నికి బూడిదై పోయిన సగర పుత్రులకు ఉత్తమ గతులు కల్పించటం కోసం భగీరథుడు ఎంతో కష్టపడి గంగను భూమి మీదకు తీసుకువచ్చాడు.దిలీప మహారాజు తన పితామహులైన సాగరులకు ఉత్తమ గతులు కలగటం కోసం గంగను భువికి తీసుకురావాలని చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. అప్పుడు యశస్సు కలిగిన భగీరథుడు అనే కుమారుడికి జన్మనిచ్చి, భూభారాన్ని అప్పగించి, తపో వనాలకు వెళ్లిపోయాడు. ఆ తరవాత భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు.
అటు పిమ్మట గంగానదిని దివి నుండి భువికి దింపటానికి స్థిరమైన సంకల్పాన్ని ఏర్పరచుకొన్నవాడై భగీరథుడు హిమాలయ పర్వతానికి వెళ్లాడు. ఆ మంచుకొండ, అనేక విధాలైన శైలద్రవ్యాలు గల ఎత్తయిన శిఖరాలతో, నీటి బరువుతో వంగిన పెద్ద పెద్ద మబ్బు దొంతరలతో ఆవరించడం వల్ల నల్లనైన మంచుతో నిండి ఉంది. సింహాలు, శరభాలు, పెద్ద పులులు చేసే కోలాహల ధ్వనులతో అందంతో పాటు భయాన్ని రేకెత్తించేదిగా విలసిల్లుతోంది. దిలీప వంశానికి దీపం వంటివాడైన భగీరథుడు ఆ హిమవత్పర్వతంలో దేవమానంలో వెయ్యేండ్లు దీక్షతో కటిక ఉపవాసాలు చేశాడు. ఉపవాసం ముగిసిన మర్నాడు ఆకుకూరలు, పళ్లు, నీళ్లు, వేళ్లు మాత్రమే భుజించి దేవతలను అర్చిస్తూ, తపస్సు చేశాడు. భగీరథుడు చేసిన కఠోర తపస్సుకు ప్రీతి చెంది గంగాదేవి సాక్షాత్కరించి, ‘భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఇష్టమైన కోరిక కోరుకో’ అని అడుగగా, అతడు అంజలి ఘటించి, ‘నీ పుణ్యజలాల మహిమ చేత నా పూర్వీకులకైన సరగపుత్రులు స్వర్గలోకాన్ని పొందగలరు. నువ్వు ఈ దేవమార్గం నుండి భూమండలానికి దిగిరావాలని నా ప్రార్థన’ అన్నాడు.
అప్పుడు గంగ ‘నేను దివి నుండి భువికి దిగి వచ్చేటప్పుడు నా నీటి వెల్లువను భరించగలిగినవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. నువ్వు ముందు ఆయనను ప్రసన్నుడిని చేసుకో’ అని చెప్పింది.గంగాదేవి మాట ప్రకారం భగీరథుడు కైలాసానికి వెళ్లి, భగవంతుడైన ఈశ్వరుడి గురించి చాలాకాలం కఠోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై, ‘నువ్వు గంగాదేవిని దివి నుండి భువికి అవతరించేయి. నేను గంగను ధరిస్తాను’ అని పలికాడు. భగీరథుడు మళ్లీ గంగను అర్చించాడు. ఆవిడ కరుణించింది. గంగానది శివుని శిరస్సు మీదుగా భూమి మీదకు ప్రవహించింది. అగస్త్య మహర్షి తాగిన తర్వాత, శూన్యమైన సముద్రుడి దగ్గరకు సగర సుతులకు మేలు చేయటం కోసం పయనమై, ఆ సముద్రుడిని విస్తారమైన నీటితో నింపింది. సగరుడి కొడుకులకు పుణ్యగతి కలిగింది. భగీరథుడి యశస్సు సమస్త లోకాలలో వ్యాపించింది .
గంగానదిని భూమి మీదకు రప్పించటం ఒక్క క్షణంలో జరిగిపోలేదు. భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ముందుగా గంగమ్మను ప్రార్థించాడు, ఆ తర్వాత శివుడిని అర్చించాడు, ఆ తర్వాత మళ్లీ గంగమ్మను ప్రార్థించి ప్రసన్నం చేసుకుని, తన కార్యం నెరవేర్చుకున్నాడు. అంతటి ప్రయత్నం చేశాడు కనుకనే భగీరథ ప్రయత్నం అనే మాట వాడుకలోకి వచ్చింది. ఈ సందర్భంగా మరో మాట చెప్పుకోవాలి ‘నువ్వు గెలిచేవరకూ నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ wwww చెప్పాలన్నా, ఎవరైనా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. అప్పుడు నీకు, నీ కథకు ఒక విలువ ఏర్పడుతుంది’ అనే మాటభగీరథుడి విషయంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.మనిషి ఎన్నడూ తన ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. ఓటమి చెందినంత కొద్దీ గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి అని ఈ కథ చెప్తోంది.