చంద్రగ్రహణం: దేశ వ్యాప్తంగా ఆలయాలు మూసినా.. శ్రీకాళహస్తి తెరిచే ఉంటుంది.. కారణం ఇదే.

చంద్రగ్రహణం: దేశ వ్యాప్తంగా ఆలయాలు మూసినా.. శ్రీకాళహస్తి తెరిచే ఉంటుంది.. కారణం ఇదే.

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా దేశంలోని దాదాపు అన్ని ఆలయాలు మూసివేసినా.. ఆ ఒక్క ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణం ప్రభావం ఆ ఆలయంపై పడదని పండితులు చెబుతున్నారు. శక్తివంతమైన గ్రహణం నుంచి తట్టుకునే శక్తి కలిగిన ఆలయంగా పేర్కొంటున్నారు. అదే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తి ఆలయం.

భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరే ఆలయానికీ లేదు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ, కేవలం శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే తెరచి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడి క్షేత్రం. 

ఖగోళ సంఘటనలైన గ్రహణాల సమయంలో ఇతర ఆలయాలు మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం గ్రహణ దోషాలు ఉండవని నమ్మకం. అందుకే ఈ సమయంలో కూడా ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు చెబుతున్నారు.  స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వేద పండితులు మారుతీ శర్మ వెల్లడించారు. గ్రహణ సమయం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిండి ఉంటుందన్నారు.

గ్రహణ కాలంలో అత్యంత శక్తివంతమైన కిరణాలు విడుదలవుతాయని, ఆ కిరణాలు చెడు ప్రభావాన్ని చూపుతాయనే ఆలయాలను మూసివేస్తారు. ఈ శక్తి గోపురాల్లోఉండే కాస్మిక్ ఎనర్జీపై ప్రభావం చూపుడంతో విగ్రహాల్లో ఉండే దేవతల శక్తి పోతుందనే నమ్మకంతోనే ఆలయాలను మూసివేస్తారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవగ్రహ కవచం ఉందని, దానివల్ల దైవశక్తి క్షీణించదని చెప్తారు. అందుకే గ్రహణ సమయంలోనూ ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారని వేదపండితులు మారుతీ శర్మ తెలిపారు.