
ఆదివారం ( సెప్టెంబర్ 7 ) చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడ్డాయి.. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. గ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ( సెప్టెంబర్ 8 ) తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నట్లు తెలిపారు అధికారులు. ఇవాళ రాత్రి 9:50 గంటలకు చంద్రగ్రహణం మొదలై సోమవారం వేకువజామున 1:31 గంటలకు వీడనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
ALSO READ : చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత...
సోమవారం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు భక్తులకు శ్రీవారి దర్శనం మొదలవనుంది.
ఇదిలా ఉండగా.. చంద్రగ్రహణం కారణంగా.. ఇవాళ ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను కూడా రద్దు చేసింది టీటీడీ. మరోవైపు గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని కూడా సాయంత్రం 3 గంటలకే మూసేశారు. తిరిగి సోమవారం ఉదయం 8: 30 గంటలకు అన్నప్రసాద కేంద్రం తెరవనున్నట్లు తెలిపారు అధికారులు.ఈ క్రమంలో తిరుమలలోని పలు ప్రదేశాల్లో 50 వేల అన్నప్రసాద ప్యాకెట్లను అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు.