
ఆదివారం ( సెప్టెంబర్ 7 ) చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీవారి ఆలయం కూడా మూసేశారు. నిత్యం భక్తుల రద్దీతో ఉండే తిరుమలలో గ్రహణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు ఏమాత్రం కనిపించడం లేదు. అలిపిరి టోల్ గేట్ దగ్గర పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ వందలాది వాహనాలు బారులు తీరి ఉండే టోల్ గేట్ ఇప్పుడు గ్రహణం ప్రభావంతో ఒక్క వాహనం కూడా కనిపించడం లేదు.
నిత్యం భక్తుల రద్దీతో, గోవింద నామస్మరణతో మారుమోగే శ్రీవారి ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. నాదనీరాజనం, శ్రీవారి ఆలయ పరిసరాల్లో భక్తులు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తిరుమలలో ఇలాంటి సీన్స్ చాలా అరుదు అనే చెప్పాలి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల కొండలు నిర్మానుష్యంగా కనిపించేది ఒక్క గ్రహణ సమయంలోనే కాబోలు. కాకపోతే.. కరోనా కారణంగా అప్పట్లో శ్రీవారి ఆలయం మూసేసిన సమయంలో కూడా ఈ సీన్లు కనిపించాయి. ఆ తర్వాత తిరుమల నిర్మానుష్యంగా కనిపించింది గ్రహణ సమయంలోనే అని చెప్పాలి.
గ్రహణం కారణంగా ఇవాళ తిరుమల నిర్మానుష్యంగా ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. నిత్యం రద్దీగా శ్రీవారి సన్నిధిని ఇలా నిర్మానుష్యంగా చూడటం ఇదే ఫస్ట్ టైం అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తుంటే.. తిరుమలలో కర్ఫ్యూ ఏమైనా విధించారా అంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.