ఈ వారం కథ ‘ఉసురు’

ఈ వారం కథ ‘ఉసురు’

‘సార్! పరిమళ జాయినింగ్ రిపోర్ట్..’ ఓ ఫైలు టేబుల్ మీద పెడుతూ చెప్పాడు సూపరింటెండెంట్. అందుకుని పరిశీలించసాగాడు శ్రీకర్. కుదురుగా ఉన్నాయి అక్షరాలు. చేతి రాత స్పష్టంగా అర్థమవుతోంది. సపోర్ట్ పేపర్స్ చూడసాగాడు.. కొన్ని నిముషాల తర్వాత.. ‘బెల్ కొట్టాడు’. మరుక్షణంలోనే అటెండ్ అయిన ఆఫీస్ సబార్డినేట్​తో. ‘‘కొత్తగా చేరిన పరిమళను పిలువ్..’’ అని చెప్పాడు.  

‘‘నమస్తే సార్..’’ మధురమైన కంఠస్వరం విని ‘ఫైల్’ చూస్తున్న శ్రీకర్ తల ఎత్తాడు. ఎదురుగా నిల్చున్న ఆమెను చూసి ‘స్టన్నయ్యాడు’. 
అతడిని చూసిన ఆమెదీ అదే పరిస్థితి.
‘‘నువ్వు..నువ్వు. ! ” అంటూ.. ఆమే తేరుకుని.. ‘‘నా పేరు పరిమళ సార్. ఈ రోజు జాయినవడానికి వచ్చా సార్..” అన్నది. 
‘‘ కూర్చో..’’ సాధారణంగా లేడీ స్టాఫ్​ను ‘అమ్మా’ అని సంబోధించే అతను ఆమెను అలా అనలేకపోయాడు. ఎదురుగా కూర్చుందామె. 
‘‘పరిమళా..బాగున్నావా?’’ అడిగాడతను. అతనిలో కొద్దిగా గిల్టీ ఫీలింగ్.
‘‘సార్, నా జాయినింగ్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి, నా సీటు ఎక్కడో చెప్తే, నా డ్యూటీ నేను చేసుకుంటా...” ఆ మాటలు విధేయంగానే ఉన్నా ఎక్కడో గుచ్చుకున్నాయి శ్రీకర్​కు.
‘‘ఓ..” అంటూ ‘‘సరే, నువ్వు వెళ్ళు. నీకు సూపరింటెండెంట్ పని చెప్తాడు” అని ముక్తసరిగా చెప్పాడు.
‘‘థ్యాంక్స్​ సార్..’’ అంటూ వెనుతిరిగింది పరిమళ.
‘పరిమళ’.. ఇలా కనిపించి, తనలోని జ్ఞాపకాలను మళ్లీ తట్టిలేపుతుంది అనుకోలేదు. ఏదో అపరాధ భావన. తనకున్న ఫీలింగ్సే పరిమళలోనూ ఉన్నాయా? దాదాపు 20 ఏండ్ల క్రితం జ్ఞాపకాలు.. మనసును ‘ముల్లు’లా గుచ్చుతున్నా, ఇప్పుడు తను ప్రత్యక్షంగా కనిపించే సరికి మనసు సలుపుతోంది. తను ఆమెకు చేసిన ద్రోహం తక్కువదా మరి. ఆమెను కోల్పోయి తాను పొందిందేమిటి? మనసుకు ప్రశాంతత కరువై బతుకుతున్నాడు. ‘ఛ’ మూడ్ అవుట్ అయింది. పేరుకే ‘ఆర్డీవో’. వ్యక్తిగతానికొస్తే..!? 

పరిమళ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ‘తనకు ట్రాన్స్​ఫర్ ఇక్కడికే కావాలా? శ్రీకర్ కంట్రోల్​లోకి తను వెళ్తుంది అంటే, వేరే ప్లేస్​లో పోస్టింగ్ తెచ్చుకునేది. ఇక్కడ కలిశాడేమిటి ఈ మహానుభావుడు? ఇది తను ఊహించనిది. ఎందుకంటే, తన జీవితం మీద శ్రీకర్ కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. యాంత్రికంగానే కలిసారనుకున్నా, ఇక్కడ పని చేయాలంటే తనకు మనసొప్పడం లేదు. కానీ, ఏం చేస్తుంది? ఇప్పటికిప్పుడు ట్రాన్స్​ఫర్ అంటే కుదిరే పని కాదు. కనీసం, ఓ రెండు, మూడేండ్లు అయినా

‘టైం’ పడుతుంది. ఏదేమైనా, తన ‘డ్యూటీ’ తను చేసుకోవాలి. పొరపాటున, అతనేమైనా చనువు తీసుకున్నా ‘కేసు’ పెట్టడానికి అయినా సిద్ధంగా ఉండాలి. ఆలోచనల్లో వున్న పరిమళ సూపరింటెండెంట్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. 
‘‘అమ్మా! నీ అకామిడేషన్ ఎక్కడ? నీకు అభ్యంతరం లేకపోతే, నీకు రూం దొరికే వరకు మా ఇంట్లో వుండొచ్చు” అన్నాడు.
‘‘థ్యాంక్యూ సార్..ఈ ఊళ్లో మా రిలేటివ్స్ వున్నారు. రెండు రోజుల్లోనే రూం చూసుకొని షిఫ్ట్ అవుతాం. మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఒక సింగిల్ బెడ్ రూం పోర్షన్ చూసి పెడతారా? నేనూ, మా వారూ వుంటాం” రిక్వెస్ట్ చేసింది పరిమళ. 
‘‘అలాగేనమ్మా. నీకు ఆఫీస్ దగ్గరైతే బాగుంటుంది. అన్నట్టు మీ వారేమి చేస్తుంటారు..?’’ అడిగాడు సూపరింటెండెంట్. 
కొద్దిగా మౌనం. ‘‘ఫర్వాలేదు లేమ్మా. రూం చూస్తా” అక్కడికి కట్ చేయబోయాడు.
‘‘అదేమీ లేదు సార్. మా వారు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేవారు. ఆ కంపెనీ మూతబడింది. ప్రస్తుతం ఒక షాప్​లో వర్క్ చేస్తున్నారు’’ తేలికగానే వివరించింది. 
‘‘ఓ, అలాగా” అన్నాడాయన. 
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పిలిచాడు శ్రీకర్, పరిమళను. ‘‘నా మీద కోపం పోలేదా? సారీ పరిమళా’’. 
‘‘ఈ ‘సారీ’తో అన్ని మలినాలూ పోతాయా?” అతనితో మాట్లాడడం ఆమెకు ఇష్టం లేదు.  సుపీరియర్ కనుక తప్పడం లేదు. 
‘‘నీతో నేను చాలా మాట్లాడాలి పరిమళా” అన్నాడు.
‘‘మాట్లాడుతూనే ఉన్నారుగా!’’
‘‘ఇక్కడ కాదు.’’
‘‘మరెక్కడ? లాడ్జ్ లోనా??” వెటకారం, ఆమె మాటల్లో.

తల వంచుకున్నాడు శ్రీకర్. అంత పెద్ద ఆఫీసర్ తల వంచుకున్నాడంటే ఎంత అపరాధ భావన దహిస్తుండాలి..? ‘‘నీకు నేను చేసిన ద్రోహానికి, నాకు తగిన శాస్తి జరిగింది పరిమళా’’ మనసులో బాధ. శ్రీకర్ ఇంటికి చేరేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ‘జోక్స్’ వేసుకుంటూ ఫోన్​ మాట్లాడుతోంది కీర్తి. అతన్ని చూసి కూడా మాట్లాడటం ఆపలేదు. కానీ, కొంచెం గొంతు తగ్గించింది. ఆ ఫోన్​ ఎవరితోనో అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు శ్రీకర్. అది తన భార్య కీర్తి ‘బాయ్ ఫ్రెండ్’ది. ఇది బహిరంగ రహస్యమే! అయినా భార్యను ఏమీ అనలేని అశక్తుడు. ‘పరువు..పరువు’. సొసైటీలో గౌరవమైన హోదాలో ఉన్న శ్రీకర్ ఇది భరించలేకపోయినా.

తప్పదు.. కీర్తితో పెండ్లి అయిన కొత్తలోనే ఆ విషయం తెలిసింది. అయినా ఏమీ చేయలేని అశక్తతతో నిర్లిప్తంగా ఉండటానికి కారణం. కీర్తి కోటానుకోట్ల సంపద వున్న వ్యక్తికి ఏకైక గారాల పుత్రిక కావడమే! ఇప్పుడు, తను అనుభవిస్తున్న ఈ ఆస్తి, పోష్​ బంగళా అన్నీ ఆమెవే. కీర్తి ప్రేమించిన వ్యక్తి వేరే కులంవాడు కావడం వల్ల ఆ ప్రేమను తండ్రి ఒప్పుకోలేదు. సరిగ్గా ఆ టైంలోనే గ్రూప్స్​లో ప్రతిభ చూపిన శ్రీకర్​ గురించి ఎవరో చెప్పారు కీర్తి తండ్రికి. అలా కీర్తికి భర్త అయ్యాడు శ్రీకర్​. కీర్తిని బెదిరించి, భయపెట్టి తనకు కట్టబెట్టారని ఆ తర్వాత తెలిసింది. ఒక కొడుకు పుట్టాడు. అసలు, ఆ ప్రెగ్నెన్సీ వుంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. కానీ, ఆమె తల్లిదండ్రులు జోక్యంతో బిడ్డను కన్నది. 

ఆస్తి కోసం తండ్రి చెప్పిన దానికల్లా తలూపింది కీర్తి. తండ్రి చనిపోయాక ఆమె అసలు రూపం బయటపడింది. సింహ భాగం క్లబ్బులు, పబ్బుల వెంటే తిరిగేది. కన్నకొడుకును కూడా పట్టించుకోలేదు. తల్లి పెంపకం సవ్యంగా లేకపోతే, కొడుకు ఎలా తయారవుతాడో, అలా తయారయ్యాడు. చాలాసార్లు విడాకులు ఇద్దామనే ఆలోచన వచ్చింది శ్రీకర్​కు. కానీ, పరువు పోతుందని అన్నీ సహించాడు. అదీగాక ‘‘కేసులు పెడతా” అని బెదిరించేది. కీర్తి మేనమామ రాష్ట్ర మంత్రి. దాంతో, మరీ తెగింపు నేర్చుకున్నది. ఉన్న ఒక్క కొడుక్కీ చదువు అబ్బలేదు. ఆవారాగా తిరుగుతూ తరచూ పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. తండ్రి ముందే సిగరెట్టు తాగడం, లెక్క చేయకపోవడం. ఇన్ని సమస్యల మధ్య హోదా ఉంటే మాత్రం ఏం లాభం? పరిమళకు తాను చేసిన అన్యాయమే, తనకు ‘ఉసురు’ కొట్టిందేమో అనిపించింది చాలాసార్లు.

తమ కుటుంబం పాలకొల్లులో ఉండేటప్పుడు, పక్క పోర్షన్​లోనే ఉండేది పరిమళ ఫ్యామిలీ. రెండు కుటుంబాలు కలిసి మెలిసి ఉండేవి. అలా సాన్నిహిత్యం ఏర్పడింది శ్రీకర్​, పరిమళ మధ్య. శ్రీకర్ బ్రిలియంట్ స్టూడెంట్ కావడం వల్ల చదువులో పరిమళకు గైడెన్స్ ఇచ్చేవాడు. శ్రీకర్ ఆమె దృష్టిలో ఒక హీరో. చదువులో చురుకుదనం చూసి, అతని కోసం వాళ్ల ఇంటి మీద పెంట్ హౌస్ కట్టించారు. తమ కుటుంబాలకున్న దగ్గరి పరిచయం వల్ల శ్రీకర్ రూంకు పరిమళ వెళ్ళడాన్ని అభ్యంతర పెట్టలేదు. శ్రీకర్ సలహాల ప్రకారం పరీక్షలు రాసి, మంచి మార్కులు తెచ్చుకుంటున్న పరిమళను చూసి మురిసిపోయేవారు ఆమె తల్లిదండ్రులు.  శ్రీకర్​ను అల్లుడ్ని చేసుకోవాలనేది పరిమళ తల్లిదండ్రుల ఆలోచన. 
ఒకరోజు పెంట్ హౌస్​లో కూర్చొని ఏవో సబ్జెక్ట్స్ గురించి ఇద్దరూ మాట్లాడుకోసాగారు. ఆ రోజు ముసురు పట్టింది. ‘‘ఈ వాతావరణంలో వేడి వేడి పకోడీలు తింటే ఎలా వుంటుందంటావ్ పరిమళా?” జోవియల్​గా అడిగాడు శ్రీకర్. 

‘‘భలే కోరిక కోరావ్’’ చిలిపిగా అంది పరిమళ.  
‘‘అవును.ఈ వెదర్​ చాలా బాగుంది. నాకొక అరగంట టైం ఇస్తే ఇంటికెళ్ళి నువ్వు కోరింది చేసుకొస్తా’’ అని చెప్పింది పరిమళ. అన్నట్టుగానే, ఒక బాక్స్ నిండా వేడి వేడి పకోడీలు తీసుకొచ్చింది పరిమళ. 
‘‘ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లివి..’’ కవితాత్మకంగా అన్నాడతను.
‘‘ఇక చాలు. పైత్యం ఆపి లాగించు..’’ వేడిమీద ఉన్నాయేమో, పకోడీలు టేస్టీగా ఉన్నాయి. కుడి చేత్తో వాటిని అందుకుంటూ, ఎడమ చేత్తో పరిమళ చేతిని నొక్కాడు. 
చప్పున చేయి గుంజుకుంది. ‘‘ శ్రీకర్..దిసీజ్ టూ మచ్..”అంది. కానీ, అతని చేతి స్పర్శ తనకూ హాయిగానే ఉంది. అయితే, హద్దులు చెరపడం అంత శ్రేయస్కరం అనిపించడం లేదు. 
‘‘ ప్లీజ్ పరిమళా. మనం పెళ్లి చేసుకుందాం. ప్రామిస్..” అన్నాడు శ్రీకర్​. 
‘‘ముందు చదువు పూర్తి చెయ్యి. తర్వాత పెళ్లి గురించి’’  మాట్లాడొచ్చు అందామె.
‘‘కంపల్సరీ గా చేసుకుందాం. నీమీదొట్టు. కావాలంటే, బాండ్ పేపర్ మీద అఫిడవిట్ చేయిస్తా’’ ఎందుకనో, అతని చిలిపితనం తనని లొంగి పోయేలా చేస్తోంది. జయించలేని ఆ బలహీన క్షణం విజయం సాధించింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కళ్లనిండా నీళ్లు నింపుకుని శ్రీకర్ ముందు నిల్చుంది పరిమళ. ‘‘డాక్టర్​ దగ్గరకు వెళ్ళా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసింది. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి” అంది. 
ఆలోచనల్లో పడ్డాడు శ్రీకర్. కొద్ది రోజుల తర్వాత శ్రీకర్ తండ్రికి ట్రాన్స్​ఫర్​ అయింది. వారంలోనే ఇల్లు ఖాళీ చేశారు. 
‘‘మరి, నా సంగతేంటి?’’ గుడ్ల నీళ్ళు కుక్కుకుని నిలదీసింది పరిమళ.
‘‘ సారీ..నీకు న్యాయం జరుగుతుంది”అన్నాడు తల వంచుకుని.

గతం నుంచి ఇహంలోకి వచ్చాడు శ్రీకర్. నాలుగు రోజుల తర్వాత స్వీట్ పాకెట్ పట్టుకొచ్చింది పరిమళ ఆఫీస్​కు. ‘‘ఏంటమ్మా విశేషం?”అడిగాడు సూపరింటెండెంట్. 

‘‘మా బాబు మైక్రోసాఫ్ట్​లో మంచి ఆఫర్​తో సెలక్టయ్యాడు సార్..” ఎంతో ఉల్లాసంగా చెప్పింది. 
‘‘సంతోషంగా ఉందమ్మా. అయితే ఈ రోజు పేపర్లో సంజయ్..!’’. 
‘‘అవును సార్. అతను మా బాబే”
‘‘ వండర్. కోటిన్నర ప్యాకేజీ. ఎంత అదృష్టవంతురాలివమ్మా..” అభినందన పూర్వకంగా చెప్పాడు అతను. 
ఆయనకు స్వీట్ అందించి శ్రీకర్ చాంబర్ వైపు నడిచింది పరిమళ. ‘‘సార్..” పిలిచింది. తలెత్తి చూసిన శ్రీకర్ ‘‘ఓ.. పరిమళా! కూర్చో. ఏంటి విశేషం?” చేతిలో స్వీట్ పాకెట్ చూస్తూ అడిగాడు. విషయం చెప్పింది. 
‘‘కంగ్రాట్స్” అంటూ బెల్ కొట్టి ఆఫీస్ బాయ్​ను పిలిచి ఆ రోజు పేపర్ తెప్పించుకుని చూసాడు శ్రీకర్. అతని మొహం విప్పారింది. చిరునవ్వుతో ఆమె కేసి చూశాడు. 
‘‘మీరు చాలా సంతోషిస్తున్నట్టున్నారు. మీకో విషయం చెప్పాలి... నా భర్త వద్దన్నా, ఆ పాపాన్ని నేను తీయించేసుకున్నా. సంజయ్​ ఆయన రక్తం. ఆయనే, నన్ను చదువుకునేలా ప్రోత్సహించాడు. చిరుద్యోగి అయినా మానవతాదృక్పథం ఉన్న మహనీయుడు. నాకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు. ఒక రత్నాన్ని నాకందించాడు” నిరుత్తరుడై చూస్తున్న శ్రీకర్​తో చెప్పింది పరిమళ. 
‘‘ సార్.. ఈ రోజు నేను ఎంతో సంతోషంతో ఉన్నా. దయచేసి ఈ స్వీట్ తీసుకోండి..” అంటూనే ‘‘ఇక్కడకు ట్రాన్స్​ఫర్​ అయి వచ్చాకే తెలిసింది.. మీరు నా ఆఫీసర్​ అని. ట్రాన్స్​ఫర్​కి ట్రై చేయడమో, సెలవు పెట్టడమో చేద్దాం అనుకున్నా. ఇప్పుడిక ఆ ఆలోచన విరమించుకుంటున్నా. నా కొడుకు గొప్పదనం గురించి స్టాఫ్ తరచూ అభినందిస్తుంటే... ఆ మాటలు వింటూ ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నా” అని నొక్కి చెప్పి, వెనక్కి తిరిగి వెళ్తున్న ఆమె మనసులోని భావం గ్రహించిన శ్రీకర్​కు ‘‘దేవుడనే వాడున్నాడో లేడో! కానీ, చేసిన పాపం ‘ఉసురు’ రూపంలో తగిలి తీరుతుంది. అది మనఃశ్శాంతిని దహిస్తుంది” అనిపించింది. - పతంగి శ్రీనివాసరావు, సెల్: 9182203351