ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. క్రియేటర్లకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడి రీల్స్ కంటెంట్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసకునేందుకు ‘వాయిస్ ట్రాన్స్లేషన్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు ‘లిప్ సింక్’ టూల్ కూడా ఉంది. ఇప్పటివరకు కేవలం ఇంగ్లిష్, హిందీ వంటి భాషలకు మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీ తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
అయితే, వీడియో కంటెంట్ ట్రాన్స్లేషన్లా కాకుండా చాలా నేచురల్‌గా ఉంటుంది. పైగా రోబోటిక్ వాయిస్‌లా ఉండకుండా అచ్చం ఒరిజినల్లా అనిపిస్తుంది. గొంతులోని పిచ్, స్టైల్, ఎమోషన్స్‌కు తగ్గట్టు పసిగట్టి అలానే అనువదిస్తుంది. దీనికి లిప్ సింక్ ఫీచర్ కూడా తోడవ్వడంతో మాట్లాడే వ్యక్తి పెదవుల కదలికలను బట్టి ఏఐ ఆటోమేటిక్‌గా అనలైజ్ చేసి, ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు దానికనుగుణంగా కదలికలను మారుస్తుంది. కాబట్టి కంటెంట్‌ను ఏ భాషలో చూసినా ఒరిజినల్ వాయిస్‌లానే అనిపిస్తుంది. వాయిస్ మాత్రమే కాదు, వీడియో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కూడా దేవనాగరి, బెంగాలీ, అస్సామీ స్క్రిప్ట్‌లలో కొత్త ఫాంట్లను తీసుకురావడం ద్వారా క్రియేటర్లు తమ వీడియోలకు వాళ్ల భాషలో క్యాప్షన్లు రాసుకోవచ్చు.
లిమిట్స్ క్రాస్ చేయకుండా..
సోషల్ మీడియాలో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం కూడా మంచిది కాదని పిల్లల కోసం ఆల్రెడీ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్‌ను తీసుకొచ్చింది యూట్యూబ్. పిల్లలను ఎక్కువసేపు సోషల్ మీడియాలో ఉండనివ్వకుండా, వాళ్ల యాక్టివిటీలు, చదువును ఎంకరేజ్ చేసేలా పేరెంటల్ కంట్రోల్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పుడు మరో అప్డేట్ను పంచుకుంది. అదేంటంటే.. పిల్లలు యూట్యూబ్ షార్ట్స్‌ను ఎంతసేపు చూడాలో టైం లిమిట్ పెట్టొచ్చు. అంతేకాదు, త్వరలోనే షార్ట్స్ ఫీడ్‌ను పూర్తిగా జీరోకి సెట్ చేసే చాన్స్ కూడా ఉందట. అవసరాన్ని బట్టి ఒకరోజు కంప్లీట్ షార్ట్స్‌ను ఆపేయడం లేదా ఎంటర్టైన్మెంట్ కోసం 60 నిమిషాల వరకు లిమిట్ పెట్టొచ్చు.
►ALSO READ | ఇంజక్షన్ అంటే భయపడతారు.. కానీ ఈ డాక్టర్ ఇంజక్షన్ వేస్తే మాత్రం నవ్వుతారు.. స్పెషల్ ఏంటంటే..?
15 నిమిషాలు, అరగంట, 45 నిమిషాలు, గంట లేదా రెండు గంటలుగా షార్ట్స్ టైమ్‌ని సెట్ చేసుకోవచ్చు. సూపర్వైజ్డ్ యూట్యూబ్ అకౌంట్లలో బెడ్ టైం, ‘టేక్ ఎ బ్రేక్’ రిమైండర్లను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు టీనేజర్లకు ఉపయోగపడేలా కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా కొత్తగా క్రియేటర్ గైడ్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఖాన్ అకాడమీ, క్రాష్ కోర్స్, టెడ్-ఎడ్ లాంటి ఎడ్యుకేషనల్ వీడియోలను టీనేజర్లకు ఎక్కువగా సూచించనుంది. వీటిని యూత్ అడ్వైజరీ కమిటీ, యూసీఎల్ఏకి చెందిన సెంటర్ ఫర్ స్కాలర్స్ అండ్ స్టోరీటెల్లర్స్‌తో కలిసి డిజైన్ చేసినట్టు తెలిపింది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్, బోస్టన్ చిల్డ్రెన్స్ హాస్పిటల్స్‌కు చెందిన డిజిటల్ వెల్నెస్ ల్యాబ్‌తోపాటు అంతర్జాతీయ సంస్థల ఎక్స్పర్ట్స్ దీనికి సపోర్ట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అప్డేటెడ్ సైన్ అప్ విధానంతో టీనేజర్లకు ఆటోమేటిక్‌గా అండర్-18 ప్రొటెక్టెడ్ అకౌంట్లలోకి తీసుకొచ్చేలా యాప్‌లోనే వెసులుబాటు కల్పించింది.
