పసిపిల్లలకు ఇంజెక్షన్ చేసినప్పుడు నొప్పి తట్టుకోలేక బాగా ఏడుస్తారు. కానీ.. డాక్టర్ ఇమ్రాన్ పటేల్ ఇంజెక్షన్ చేస్తే మాత్రం హాయిగా నవ్వుతారు. ఎందుకంటే.. ఆయన షారుఖ్ ఖాన్ స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ, పాటలు పాడుతూ.. చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తూ నొప్పిని మర్చిపోయేలా చేస్తాడు. అందుకే నవ్వుతూ ఇంజెక్షన్ తీసుకుంటారు. అలా చేస్తున్నందుకే ఈ ‘చైల్డ్ విస్పరర్’ని సోషల్ మీడియాలో కొన్ని మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కామెంట్ల ద్వారా తమ అభిమానాన్ని పంచుతున్నారు.
డాక్టర్ ఇమ్రాన్ పటేల్.. ఈ పేరు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది తల్లిదండ్రులకు సుపరిచితం. పీడియాట్రిక్ మెడిసిన్‌లో ఎక్స్‌పర్ట్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం. ఇమ్రాన్ గుజరాత్‌లోని మంగ్రోల్ అనే చిన్న తీర ప్రాంత పట్టణంలో పుట్టాడు. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగాడు. తండ్రి ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. తల్లి హౌస్‌వైఫ్. పేరెంట్స్ చిన్నప్పటినుంచే ఉన్నంతలో పేదలకు సాయం చేయడం నేర్పించారు. అతనికి మొదటినుంచి పిల్లల మీద ప్రేమ, సానుభూతి ఉండేవి. అందుకే ఎంబీబీఎస్ తర్వాత ఎండీ (పీడియాట్రిక్స్) చేశాడు. ఆ తర్వాత ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీ, నాయర్ హాస్పిటల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రాక్టీస్ చేశాడు. 12 సంవత్సరాల అనుభవం తర్వాత నియోనెటాలజీ, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్‌లో ఎక్స్‌పర్ట్ అయ్యాడు. దాంతో లోన్ తీసుకుని అహ్మదాబాద్‌లో ఏషియన్ చిల్డ్రన్ హాస్పిటల్ని స్థాపించాడు. అప్పటినుంచి పేదలకు ఫ్రీగా ఎన్‌ఐసీయూ సేవలు అందిస్తున్నాడు.
యూట్యూబ్ జర్నీ
ఇమ్రాన్ పిల్లలతో చాలా సరదాగా ఉంటాడు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ టైంలో పిల్లలను ఏమార్చడానికి పాటలు పాడేవాడు. డ్యాన్స్ చేసి వాళ్లను నవ్వించేవాడు. అయితే.. అతనికి ఒకసారి అలాంటి క్యూట్ మూమెంట్స్‌ని వీడియో తీయాలనే ఆలోచన వచ్చింది. దాంతో 2020 నుంచి వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. అప్పుడే ‘డాక్టర్ ఇమ్రాన్ పాటిల్ అఫీషియల్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టి, అందులో ఆ వీడియోలు అప్‌లోడ్ చేశాడు. అలా ఇమ్రాన్ యూట్యూబ్ జర్నీ ప్రారంభమైంది. వీడియోలు అనూహ్యంగా వైరల్ అయ్యాయి. చాలామంది తల్లిదండ్రులు ఆయనను మెచ్చుకున్నారు. అప్పటినుంచి పిల్లల ఆరోగ్యం, పేరెంటింగ్ టిప్స్, వ్యాక్సిన్ మిథ్స్‌పై హిందీలో వీడియోలు చేస్తున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్
ఇమ్రాన్ వీడియోలు యూట్యూబ్ కంటే ఇన్‌స్టాలోనే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. యూట్యూబ్‌లో అతని చానెల్‌కు 7.03 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో అతని పేజీకి 11.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక యూట్యూబ్‌లో షార్ట్ వీడియోల విషయానికి వస్తే.. ఒక వీడియోకు ఏకంగా 387 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చానెల్‌లో పది మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు బోలెడు ఉన్నాయి. కొన్నిసార్లు ఇమ్రాన్ ఫ్యామిలీతో కలిసి వ్లాగ్స్ కూడా చేస్తుంటాడు. భార్య, కొడుకు హమ్దాన్ పటేల్‌తో గడిపిన హ్యాపీ మూమెంట్స్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ప్రస్తుతం చానెల్‌లో 443 వీడియోలు ఉన్నాయి. వాటికి మొత్తంగా 25 మిలియన్ల లైక్స్ వచ్చాయి. యూట్యూబ్ గోల్డెన్ బటన్, ఎయిమ్స్ చేంజ్‌మేకర్స్ అవార్డ్ లాంటివి సాధించాడు. ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ గ్లోబల్ ఆడియెన్స్‌ను సంపాదించాడు. ఆయన వీడియోలకు యూకే, రష్యా నుంచి ఎంతోమంది రెగ్యులర్‌గా కామెంట్లు పెడుతుంటారు.
►ALSO READ | ప్రెగ్నెన్సీ టైమ్‌లో పారాసిటమాల్ వాడొచ్చు.. పుట్టే పిల్లలకు ఆటిజం, ఏడీహెచ్‌డీ రాదు
బ్యాలెన్సింగ్..
డాక్టర్‌గా అతని జీవితంలో ప్రతినిత్యం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా.. క్రమం తప్పకుండా వీడియోలు చేస్తూ వర్క్ బ్యాలెన్స్ చేస్తున్నాడు. హాస్పిటల్ పెట్టిన మొదట్లో చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఒకవైపు అప్పులు, మరోవైపు పేషెంట్స్ ట్రస్ట్ బిల్డ్ చేయాలనే లక్ష్యం, బిజినెస్ స్ట్రెస్, పేదలకు ఫ్రీ ఎన్‌ఐసీయూ కేర్ ఇవ్వడం.. లాంటివాటితో చాలా ఇబ్బందులుపడ్డాడు. అయినా.. యూట్యూబ్‌కి దూరం కాలేదు.
