
ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ రోజున చేసిన జీఎస్టీ మార్పుల ప్రకటన భారతీయ స్టాక్ మార్కెట్లలో బుల్ ర్యాలీని ప్రేరేపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గృహోపకరణాల నుంచి సిమెంట్ వరకు ఏఏ రంగాలపై ఎలాంటి ప్రయోజనం పొందొచ్చనే విషయాల గురించి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏఏ వస్తువులు లేదా సేవల రేట్లు గతంలో కంటే తగ్గుతాయని చాలా మంది భేరీజు వేసుకుంటున్నారు. అయితే చాలా కాలంగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీతో పాటు ప్రజల నుంచి ఉన్న అతిపెద్ద డిమాండ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై ఉన్న జీఎస్టీ రేట్లను తగ్గించాలన్నదే.
కరోనా తర్వాత దేశంలో ప్రజలు ఎక్కువగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపటంతో కంపెనీలు కూడా జీఎస్టీని తగ్గించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే ఇటీవల ప్రధాని మోడీ ప్రకటన ప్రకారం రానున్న కాలంలో ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు 5 శాతం లేదా సున్నా శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. దీని వల్ల ప్రజలు సాధారణంగా తాము చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుందని అనుకుంటారు కానీ వాస్తవానికి ఇది వారు చెల్లించే ప్రీమియంలను గతంలో కంటే పెంచుతుందని ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీఎస్టీ తగ్గింపుతో ఇన్సూరెన్స్ ఖరీదుగా ఎందుకు మారుతుంది..?
అసలు తగ్గాల్సిన ప్రీమియం జీఎస్టీ తగ్గింపుతో ఎందుకు పెరుగుతుందనే అనుమానం మీకు కూడా కలిగి ఉండొచ్చు. దీనికి అసలు కారణాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీని 5 శాతానికి లేదా సున్నా శాతానికి తగ్గించినప్పుడు కంపెనీలు ఎలాంటి ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందటానికి అర్హులు కావు. అంటే ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లలో పొందుతున్న టాక్స్ క్రెడిట్ ఆగిపోతుంది. దీంతో కంపెనీలు ఆదాయాల తగ్గుదలను చూస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఒకవేళ జీఎస్టీ తగ్గిస్తే తమ ఆదాయ మార్జిన్లు అంటే లాభాలు తగ్గకుండా నివారించటానికి పాలసీ ప్రీమియంలను పెంచాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ సంస్థలు. అంటే ఇక్కడ బెనిఫిట్ పూర్తిగా రివర్స్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ బృందం సీనియర్ సిటిజన్లకు సంబంధించిన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని సున్నాకు తగ్గించాలని సిఫార్సు చేసింది. దీనికి ముందు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఐఆర్డీఏ కూడా అభిప్రాయాన్ని సేకరించింది. మెుత్తానికి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను పాలసీదారులకు అందించకపోగా కొత్తగా ఖర్చులను పెంచవచ్చని నిపుణులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందు కంపెనీల నుంచి కూడా అభిప్రాయం సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు.