Hyderabad : ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు అరెస్ట్

Hyderabad : ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు సైబర్ చీటర్స్ అరెస్టయ్యారు. హైదరాబాద్​సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తికి స్కామర్స్ ఫోన్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ ఐజీఎంఎస్ విభాగం ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. 

ఎస్​బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.4.02 లక్షలు బదిలీ చేయించుకున్నారు. తర్వాత స్పందించలేదు. పోలీసులు దర్యాప్తులో నిందితులను యూపీలోని ఘజియాబాద్ కు చెందిన దేవాష్ రిస్తోగి, జితేందర్ అగర్వాల్ గా గుర్తించారు. గురువారం వారి వద్ద నుంచి 4 ఫోన్లు, 3 చెక్ బుక్స్ స్వాధీనం చేసుకొని, ఇద్దరినీ అరెస్ట్​చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.

ట్రేడింగ్ ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్ కేసులో ఒకరు..

ట్రేడింగ్ ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్ ​కేసులో సైబర్ చీటర్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ వృద్ధుడిని స్కామర్స్​ఫేస్ బుక్ ద్వారా సంప్రదించాడు. ఆన్​లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్​చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.2.02 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. 

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జులై 2న ఈ కేసులో ఏ1 విరాధ్య, 4న ఏ2 బుల్లాన్ కరపాటు, ఏ3 రోహన్, 8న ఏ4 ఖురేషి షఫీనీ భాయ్, ఏ5 కిషన్ కనుభాయ్ , ఏ6 మనీష్ భారత్​భాయ్ ని అరెస్ట్​చేసి రిమాండ్ కు తరలించారు. 

ఏ7 హరియాణాకు చెందిన వినీత్ చద్దాను గురువారం అరెస్ట్ చేశారు. ఈయనపై దేశవ్యాప్తంగా 12 సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. అతని వద్ద నుంచి 6 మొబైల్స్, లాప్ టాప్, చెక్ బుక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.