- కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె. సంజయ్ మూర్తి
బషీర్‌బాగ్, వెలుగు: ఆడిటింగ్ లో ఏఐని భాగస్వామ్యం చేస్తున్నామని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె. సంజయ్ మూర్తి తెలిపారు. బుధవారం సైఫాబాద్ ఏజీ ఆఫీసులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆనంద్ మోహన్ బజాజ్, నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ జనరల్ అలోక్ తో కలిసి ఉద్యోగులకు విధులపై దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ రంగ ఆర్థిక ఆడిటింగ్లో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకొని, ఆడిటింగ్ ప్రక్రియల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతను విస్తృతంగా వినియోగించే దిశగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ ముందడుగు వేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి టెక్ -బేస్డ్ ఆడిట్ టూల్స్, డిజిటల్ ఆవిష్కరణలు అమలు చేయనున్నట్లు వివరించారు.
