తెలంగాణ ఆడపిల్లల కండ్లకెల్లి నీళ్లు రావు.. నిప్పులొస్తయ్: కవిత

 తెలంగాణ ఆడపిల్లల కండ్లకెల్లి నీళ్లు రావు.. నిప్పులొస్తయ్: కవిత
  • తెలంగాణ తరహా ఉద్యమం దేశమంతటా రావాలె 
  • మీడియా ఫోర్త్ ఎస్టేట్ కాదు.. ప్రైవేట్ ఎస్టేట్​గా మారింది: కవిత

హైదరాబాద్, వెలుగు: దేశంలో మన హక్కులను కోల్పోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మేధావులు మాట్లాడటం బంజేశారని, మనం కోల్పోతున్న హక్కులేంటో కూడా మనకు తెలియడం లేదని పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్ర హక్కుల కోసం ఎలా పోరాడామో, ఇప్పుడూ అలాగే పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తరహా ఉద్యమం దేశమంతటా రావాలన్నారు.

సోమవారం హైదరాబాద్​లోని ముషీరాబాద్​లో తెలంగాణ జాగృతి సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారని.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్​దాకా దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆ దాడులకు భయపడబోమని చెప్పారు. తెలంగాణ ఆడపిల్లల కండ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వస్తాయని అన్నారు. 

‘‘తెలంగాణలోని యువతీ యువకులు దేశం గురించి ఆలోచించాలి. మనం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నం. మాట్లాడినం.. గొంతెత్తినం. మనం కోల్పోతున్నది ఏందో మనకు తెలిసింది కాబట్టి అడిగినం. కానీ ఇప్పుడు దేశంలో మనం కోల్పోతున్న హక్కులను కనీసం కోల్పోతున్నామని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నం. కొంతమంది నిరాశ, నిస్పృహతో వదిలేసిన్రు.

మేధావులు మాట్లాడటం బంజేసిన్రు. కవులు గళమెత్తడం మానేసిన్రు. రచయితలు పుస్తకాలు రాయడం మానేసిన్రు. ఎవరి కోసం రాయాలి? ఎందుకోసం రాయాలి? రాస్తే.. నా మీదనే దాడి జరుగుతది తప్పితే, ఎవరికి లాభమైతుందనేటటువంటి నిస్పృహలోకి పోయిన్రు. చాలామంది పేరేన్నిక గల రచయితలు తమకు వచ్చిన పెద్ద పెద్ద అవార్డులను ప్రభుత్వం మొహానా కొట్టిన్రు. దేశంలో ఇట్ల ఎందుకు జరుగుతోంది? మేధావి వర్గం ఎందుకు అసంతృప్తితో ఉంది? మనమందరం ఆలోచించాలి” అని కవిత అన్నారు.

ఎన్నికల్లోపు జాగృతి సత్తా చూపాలె.. 

సీబీఐ, ఈడీ దాడులకు భయపడబోమని కవిత చెప్పారు. ‘‘దాడులతో మన సమయాన్ని వృథా చేస్తున్నారు. మిగిలిన సమయాల్లో దానికి రెండు, మూడింతల పని చేయాల్సిన అవసరం ఉంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. విశ్రాంతి తీసుకునేది లేదు” అని చెప్పారు. ‘‘ప్రస్తుతం జాగృతి పరిధి తక్కువే అయినా ఒక్క పిలుపుతో దేశమంతటా పది రోజుల్లోనే శాఖలు ఏర్పాటు చేసే శక్తి జాగృతికి ఉంది.

ఇప్పటికే 18 దేశాల్లో కమిటీలు ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైమ్ ఉంది. ఈలోపు జాగృతి సత్తా చూపించాలి” అని పిలుపునిచ్చారు. ‘‘ఒకప్పుడు తెలంగాణ భాష, పండుగల మీద జరిగిన వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ప్రజలకు వివరించాం. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుపడే రోజుల నుంచి ఆ పండుగను గర్వంగా జరుపుకునే స్థాయికి వచ్చాం. స్కూలు పాఠాల్లో బతుకమ్మ చేరింది. మన సంస్కృతి సంప్రదాయాలకు పుస్తకాల్లో చోటు దక్కింది. ఇప్పుడు అలాంటి ఉద్యమాన్నే దేశమంతటా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ అనేక అంశాలపై ప్రజలను మేల్కొలిపేలా జాగృతి కార్యక్రమాలు నిర్వహించాలి” అని సూచించారు. 

దేశంలో అందర్నీ ఏకం చేస్తం.. 

ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన అనేక రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తోందని కవిత ఆరోపించారు. ‘‘నేనివ్వల్ల చాలా బాధతోటి ఇక్కడికి వచ్చిన. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కూల్చేస్తుంటే కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నయ్. కేంద్రం చర్యలను సమర్థిస్తున్నయ్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేస్తుంటే ప్రశ్నించడం లేదు. తప్పును తప్పు అని చెప్పకపోగా, ఆ పని చేసినందుకు పొగుడుతున్నయ్” అని మండిపడ్డారు.

ఇలాంటివి చూసినప్పుడు బాధనిపిస్తుందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ ప్రైవేట్ ఎస్టేట్ గా మారిందని కామెంట్ చేశారు. ‘‘పత్రికా స్వేచ్ఛను కేంద్రం అణచివేస్తోంది. మీడియాను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే అది మనల్ని కాపాడుతుంది. దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిన టైం వచ్చింది.

సమీకరించు, బోధించు, పోరాడు అన్న అంబేద్కర్​ సిద్ధాంతాన్ని.. తెలంగాణ ఉద్యమం కోసం ప్రొఫెసర్​జయశంకర్​అమలు చేశారు. అదే స్ఫూర్తి, సిద్ధాంతాలతో దేశమంతటా తెలంగాణ చైతన్యాన్ని రగిలించాలి. దేశంలోని కవులు, కళాకారులు, రచయితలు, స్టూడెంట్లు, మహిళలు, రైతులు, కార్మికులను ఏకం చేస్తాం. అన్ని గ్రామాల్లో చర్చలు నిర్వహిస్తాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్​ఆయాచితం శ్రీధర్, టీఎస్​ఫుడ్స్​కార్పొరేషన్​చైర్మన్​, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడె రాజీవ్​సాగర్,​ ప్రధాన కార్యదర్శి నవీన్​ ఆచారి, ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి,  సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, దేవి ప్రసాద్​తదితరులు పాల్గొన్నారు.