ప్లాన్ లేకుండా పరీక్షలు పెట్టిన ఇంటర్ బోర్డ్

ప్లాన్ లేకుండా పరీక్షలు పెట్టిన ఇంటర్ బోర్డ్
  • ఇంటర్ కాలేజీల బంద్ సక్సెస్ 
  • బోర్డును ముట్టడించిన ఏబీవీపీ

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫెయిలైన ఫస్టియర్ స్టూడెంట్లకు న్యాయం చేయాలని కోరుతూ ఏబీవీపీ ఇచ్చిన కాలేజీల బంద్ మంగళవారం విజయవంతమైంది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు బంద్​ పాటించగా, సర్కారు కాలేజీలను ఏబీవీపీ కార్యకర్తలు మూసివేయించారు. ఈ మేరకు ఏబీవీపీ నేతలు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని స్టూడెంట్లతో కలిసి ముట్టడించారు. ర్యాలీకి వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బోర్డు ఆఫీసులోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా కాలంలో విద్యారంగాన్ని గాలికొదిలేసిన టీఆర్​ఎస్ సర్కారు.. ఇవ్వాల లక్షల మంది విద్యార్థుల మానసిక క్షోభకు, స్టూడెంట్ల ఆత్మహత్యలకు కారణమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ పేపర్ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌లో అనేక తప్పులు జరిగినట్లు తెలుస్తోందని, ఉచితంగా రీవాల్యుయేషన్ చేసి స్టూడెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్లాన్ లేకుండా పరీక్షలు పెట్టిన ఇంటర్ బోర్డ్ సెక్రటరీని తొలగించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీహరి, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం వీరమళ్ల, స్టేట్ జాయింట్ సెక్రటరీ సుమన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

విద్యాశాఖ సెక్రటరీకి వినతి
ఇంటర్ బోర్డు ముందు ఏబీపీవీతో పాటు వైఎస్సార్ టీపీ, విద్యార్థి జన సమితి(విజేఎస్), యువజన సమితి ఆందోళనకు దిగాయి. ఫెయిలైన స్టూడెంట్లను పాస్ చేయాలని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్​యూ, ఏఐఎస్ఎఫ్ నేతలు సర్కారును డిమాండ్ చేశారు. విద్యాశాఖ సెక్రెటరీ సందీప్​ కుమార్ సుల్తానియాను కలిసి  వినతిపత్రం అందించారు.