
ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల్లో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం బయటపడింది. పేపర్లు దిద్దడం మొదలు.. రిజల్ట్స్ ప్రకటించే వరకూ అదే ధోరణి కొనసాగిందని రుజువైంది. తాజాగా ప్రకటించిన రీ వెరిఫికేషన్ ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైంది. 1,137 మందే పాసైనట్లు బోర్డు ప్రకటించినా.. మరో 90 వేల మంది విద్యార్థుల మార్కుల్లో మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. పాసైన విద్యార్థుల రీవెరిఫికేషన్‌లోనూ16 వేల మంది మార్కులు చేంజ్ అయినట్టు సమాచారం. ఈ లెక్కన రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు1.07 లక్షల మంది మార్కుల్లో మార్పులు జరిగాయి. అంటే లక్ష మందికిపైగా విద్యార్థుల విషయంలో ఇంటర్బోర్డులో తప్పులు జరిగాయి.
రీవెరిఫికేషన్ అంటే కేవలం సున్న మార్కులకు, దిద్దని జవాబులకు మాత్రమే మార్కులు వేస్తారు. దీంతోనే లక్షమందికి ఎక్కువ మార్కులు రావడం గమనార్హం. ఒకవేళ రీవాల్యూయేషన్ ప్రక్రియ ఉండి ఉంటే సగం మందికి ఎక్కువ మార్కులు వచ్చేవనే వాదనలు వినిపిస్తున్నాయి.
బోర్డు నిర్లక్ష్యం కొండంత..!
పరీక్షల ఫలితాల్లో ఇంతటి స్థాయిలో వివాదం తలెత్తడానికి ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. గ్లోబరీనా సంస్థతో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల చెల్లింపు, హాల్‌టికెట్ల జారీ.. ఇలా అన్నింటిలోనూ తప్పులు దొర్లినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. దీనికితోడు రోజుకు ఒక్కో లెక్చరర్‌తో 50 నుంచి 60 పేపర్లు దిద్దించడమూ మరో కారణం. ఆన్సర్ షీట్స్ వాల్యూయేషన్ ప్రక్రియలో మొత్తం 5,841 మంది లెక్చరర్లు, అధికారులు పాల్గొన్నారు. వీరిలో 2,400 మంది లెక్చరర్లను కేవలం పేపర్లు దిద్దడానికే నియమించినట్లు అధికారులు చెప్తున్నారు.
పేపర్లు ఎలా దిద్దాలనే దానిపై లెక్చరర్లకు శిక్షణ ఇవ్వకపోవడం వల్లే తప్పులు దొర్లుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ లెక్చరర్లు పర్యవేక్షణ బాధ్యతల్లో ఉండగా, పేపర్లు దిద్దే ప్రక్రియలో జూనియర్లు ఉంటున్నారు.
దాంతో కొత్తగా వచ్చిన వారికి పేపర్లు ఎలా దిద్దాలనే దానిపై క్లారిటీ లేకపోవడంతోనే ఎక్కువ తప్పులు వస్తున్నట్టు అధికారులే చెప్తున్నారు.
కనీసం ఇంత జరిగినా ప్రభుత్వం గానీ, ఇంటర్ బోర్డు గానీ స్పందించకపోవడం, తప్పెక్కడ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఓ శ్వేతపత్రం విడుదల చేయకపోవడం ప్రజల్లో, విద్యార్థుల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
లెక్చరర్లపై చర్యలు…..
ఏటా రీవెరిఫికేషన్ ఫలితాల తర్వాత తప్పులు చేసిన కొద్దిమంది లెక్చరర్లపై బోర్డు చర్యలు తీసుకునేది. ఈసారి నిబంధనల ప్రకారం బోర్డు వ్యవహరిస్తే చాలా మంది లెక్చరర్లపై చర్యలు తీసుకునే అవకాశముంది. మార్కులు పెరిగినా ‘స్టేటస్’ ఫెయిల్‌గానే ఉన్న విద్యార్థుల విషయంలో అధికారులు పెద్దగా పట్టించుకోకున్నా, మార్కులు పెరగడం వల్ల పాసైన స్టూడెంట్స్ విషయంలో మాత్రం ఆ పేపర్లు దిద్దిన లెక్చరర్లపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు అధికారులు చెప్తున్నారు. రీవెరిఫికేషన్‌తో కనీసం 5 మార్కులు పెరిగినా ఆ విద్యార్థి పేపర్లు దిద్దిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు అంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం లేదనే వాదనలూ విపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కూడా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.