
.. హైదరాబాద్‌కు చెందిన ఇంటర్ స్టూడెంట్ ఒకరు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లోనూ ఫిజిక్స్‌లో ఫెయిలైంది. ఆమె ఆన్సర్ షీట్లను చూసుకునే సరికి దాంట్లో కొన్ని పేజీలు మిస్సయ్యాయి. దీంతో ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంటర్ బోర్డుకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు చూసినా ఆన్సర్ షీట్లో 7వ పేజీ, 8వ పేజీ కనిపించలేదు.
..హైదరాబాద్‌కు చెందిన మరో స్టూడెంట్ మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. వెబ్‌సైట్‌లో అతడి ఆన్సర్‌షీట్లను డౌన్లోడ్ చేసుకుని చూస్తే, ఓఎమ్మార్ పార్ట్ 1 వేరే అమ్మాయి పేరుతో వచ్చింది. దీంతో అతడు ఇంటర్‌బోర్డుకు వచ్చి ఫిర్యాదు చేశాడు. మిగిలిన జవాబుపత్రం కూడా సరిగా దిద్దలేదని ఆ స్టూడెంట్ బోర్డు అధికారుల ముందు వాపోయాడు.
ఇలా ఒకటీ రెండు సంఘటనలే కాదు.. ఇంకా ఎన్నో ఇంటర్ బోర్డు తప్పిదాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే బాధతో ఆత్మహత్య చేసుకున్న అనామిక ఇష్యూ కూడా తాజాగా బయటికొచ్చింది. ఫెయిలైన స్టూడెంట్స్‌కు సంబంధించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిజల్ట్స్‌లో అనామిక మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టకుండా, ఐదు రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. దాంట్లో అనామిక 48 మార్కులతో తెలుగు సబ్జెక్టులో పాసైనట్టు పేర్కొన్నారు. దీనిపై ఆదివారం మీడియాలో కథనాలు రావడంతో అదే రాత్రి మళ్లీ ఆ మార్కులు తప్పని, అనామికకు వచ్చింది 21 మార్కులేనని ఇంటర్ బోర్డు చెప్పుకొచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఫెయిలైన స్టూడెంట్స్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ రిజల్ట్స్‌ను విడుదల చేసినా ఇంకా గందరగోళంగానే కొనసాగుతూ ఉంది. వేలాది మంది స్టూడెంట్స్ ఆన్సర్‌షీట్లు, రిజల్ట్స్‌ను అధికారులు సకాలంలో వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదు. ఇక, పాసైన స్టూడెంట్స్‌కు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ఫలితాల ఆన్సర్‌షీట్లను ఆదివారం రాత్రి వరకూ అప్లోడ్ చేశారు. అధికారికంగానే 8 వేల ఆన్సర్ షీట్లను అప్లోడ్ చేయాల్సి ఉందని వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏప్రిల్‌లో విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో 3, 82, 116 మంది స్టూడెంట్స్ ఫెయిలైనట్లు బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే. నాటి ఫలితాల్లో తీవ్ర తప్పులు దొర్లినట్లు ఆరోపణలు రావడం, ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆ ఫెయిలైన పిల్లలందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఏర్పాటు చేసింది. ఈ 3,82,116 మంది స్టూడెంట్స్‌కు సంబంధించి 9,02,429 ఆన్సర్ షీట్లు వెబ్‌సైట్‌లో పెట్టామని, మరో 19,788 జవాబు పత్రాల స్కానింగ్‌ను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మే 27న ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. కానీ వాటిని వెబ్‌సైట్‌లో పెట్టడానికి ఆరు రోజుల సమయం తీసుకున్నారు. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన స్టూడెంట్స్ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేస్తే, వారిలో చాలా మందివి ఒకటీ, రెండు సబ్జెక్టుల వివరాలు మాత్రమే వెబ్‌సైట్‌లో కనిపించాయి.