ఇంటర్​ బోర్డు ప్రకటనల్లో నిజమేది..అబద్ధమేది?

ఇంటర్​ బోర్డు ప్రకటనల్లో నిజమేది..అబద్ధమేది?

హైదరాబాద్‌, వెలుగు:  ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలపై బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏ ప్రకటన నిజమో.. ఏది అబద్ధమో తెలియక ఇటు స్టూడెంట్స్‌, అటు పేరెంట్స్‌ సతమతమవుతున్నారు. తాజాగా గురువారం హైకోర్టుకిచ్చిన అఫిడవిట్‌లోని అంశాలు, శుక్రవారం మీడియాకు రిలీజ్‌ చేసిన స్టేట్‌మెంట్‌ లోని విషయాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌  ఫలితాలను  మే 27నే విడుదల చేసినట్టు, ఫెయిలైన 3,82,116 మంది స్టూడెంట్స్​కు సంబంధించి మొత్తం 9,02,429 ఆన్సర్‌ షీట్స్​ అదే రోజు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు, 1183 మంది స్టూడెంట్స్​ పాసైనట్లు గురువారం హైకోర్టుకు సమర్పించిన ఆరుపేజీల అఫిడవిట్​లో  అశోక్​ పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే..  1137 మంది పాసైనట్లు మే 27న బోర్డు మీడియాకు ప్రకటించడం, 1155 మంది పాసైనట్టు జూన్‌ 5న అశోక్​ మీడియాకు చెప్పడం, 1183 మంది పాసైనట్టు హైకోర్టులో చెప్పడం వంటి పొంతన లేని లెక్కలు వివాదానికి దారితీశాయి. దీనిపై శుక్రవారం రాత్రి మీడియాకు బోర్డు కార్యదర్శి అశోక్​ వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆన్సర్​ షీట్స్​ను ఈ నెల 6 వరకు స్కానింగ్​ చేశామని  ఈ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్​లో మాత్రం మే 27నే పూర్తి చేసినట్లు తెలిపారు. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. మే 27 వరకూ 8,82,641 జవాబు పత్రాలను స్కానింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేశామని, దీంట్లో 1137 మంది పాసయ్యారని, మిగిలిన 19,788 జవాబు పత్రాల్లో ఈ నెల 4 వరకూ స్కాన్‌ చేయగా మరో18 పాసయ్యారని, ఆ తేదీ వరకు మొత్తంగా 1155 మంది పాసయ్యారని వివరించారు. ఇంకా మిగిలిపోయిన జవాబుపత్రాల స్కానింగ్‌ ప్రక్రియ ఈ నెల 6 వరకూ పూర్తిచేయగా అందులో మరో 28మంది పాసయ్యారని, ఇవన్నీ కలిపితే మొత్తం 1,183 మంది పాసైనట్టు బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌  మీడియా ప్రకటనలో వివరించారు. ఇంటర్​ బోర్డు ప్రతిరోజూ లెక్కలు మారుస్తున్నారని మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ ఇంటర్‌ వెబ్‌సైట్‌లో 19,788 ఆన్సర్‌షీట్లు స్కానింగ్‌ ప్రక్రియలో ఉన్నట్టు చూపెడుతుండటం గమనార్హం.