హైదరాబాద్ సరోగసి కుంభకోణం..మహిళ అండానికి రూ.25 వేలు..పురుషుల వీర్యానికి రూ.4 వేలు

హైదరాబాద్ సరోగసి కుంభకోణం..మహిళ అండానికి రూ.25 వేలు..పురుషుల వీర్యానికి రూ.4 వేలు

సరోగసీ పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని.. సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ ఫుట్ పాత్​లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తున్నది. వీర్యం తీసుకునేప్పుడు వారికి పోర్న్ వీడియోలు చూపించేవారని సమాచారం

వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు, అమాయకులను ముందుగా గుర్తించేవాళ్లు. వారికి డబ్బులు, బీరు, బిర్యాని ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు. సిగ్గుపడేవాళ్లకు సెపరేట్​గా పోర్న్ వీడియోలు చూపించి.. వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసింది. మరోవైపు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై పోలీసులు దాడులు చేశారు. నాలుగేండ్ల కింద సికింద్రాబాద్​లో ప్రారంభించిన ఈ సంస్థకు.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్​తో సంబంధాలు ఉన్నాయి. స్పెర్మ్​ దానం చేయాలని నిర్వాహకులు ప్రచారం చేసేవాళ్లు. వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్లు సమాచారం. 

రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకుల నుంచి సేకరించినట్టు తెలుస్తున్నది. వీర్యం ఇస్తే రూ.800 నుంచి రూ.4వేల వరకు ఇచ్చేవాళ్లు. వీరికి కూడా పోర్న్ వీడియోలు చూపిస్తూ శాంపిల్స్ సేకరించేవారని సమాచారం. అండం ఇచ్చే మహిళలకు రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు ఇచ్చేవారని తెలుస్తున్నది. ఇలా సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్​కు తరలించేవాళ్లు.

పర్మిషన్లు ఉన్నాయని బుకాయిస్తూ ట్రీట్​మెంట్

ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నాయని నిర్వాహకులు బుకాయిస్తున్నప్పటికీ, అసలు వీరికి ఎలాంటి అనుమతుల్లేవని పోలీసులు చెప్తున్నారు. దాడుల్లో దాదాపు 20 మంది నుంచి సేకరించిన నమునాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం.. సృష్టి కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నది. ఐవీఎఫ్, సరోగ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.