ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే మోదీ పని..దేశాభివృద్ధిని గాలికొదిలేశారు :కేటీఆర్

ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే మోదీ పని..దేశాభివృద్ధిని గాలికొదిలేశారు :కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే ప్రధాని మోదీ చేసే పని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మందిర్, -మసీదు, ఎవరేం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారు? అనే అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ఆయన విజయం సాధించారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను గాలికొదిలేశారని మండిపడ్డారు. శనివారం ముంబైలో జరిగిన ‘ఎన్డీటీవీ యువ 2025– ది ముంబై చాప్టర్’ సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలతో పోటీ పడాలే తప్ప.. వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదన్నారు. ‘‘దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే.. పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌‌ చుట్టూనే తిరుగుతున్నాయి. యువత ఆకాంక్షలను విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు. భారత్ యువరక్తంతో ఉరకలెత్తుతున్నదని, కానీ ఆ యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు.

 “ప్రస్తుత తరం (జెన్ జడ్) సోషల్ మీడియాకే పరిమితం కావద్దు. యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు.. మీరే ఎందుకు రాజకీయాలను నిర్ణయించకూడదు?” అని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం తెలంగాణలో ట్రిపుల్ ఆర్ (రీకాల్, రిగ్రెట్, రివోల్ట్) నడుస్తున్నది. జనం కాంగ్రెస్ సర్కార్ పనితీరు చూసి, బీఆర్ఎస్ పనితీరు గుర్తు చేసుకుంటున్నారు (రీకాల్). బీఆర్ఎస్‌‌ను గెలిపించుకోనందుకు బాధపడుతున్నారు (రిగ్రెట్). త్వరలోనే తిరుగుబాటు (రివోల్ట్) వస్తుంది” అని పేర్కొన్నారు.