
ఎంతోమంది కార్మికులు రోజూ పనికోసం లేబర్ చౌక్(అడ్డా)లకు వెళ్తుంటారు. వాళ్లలో కొందరికి పని దొరుకుతుంది. మరికొందరు మధ్యాహ్నం వరకు అక్కడే వెయిట్ చేసి ఇండ్లకు వెళ్లిపోతారు. అలాంటి వాళ్లకు సరైన గుర్తింపు, స్థిరమైన ఆదాయం అందించాలనే లక్ష్యంతో చంద్రశేఖర్ డిజిటల్ లేబర్ చౌక్‌ని ఏర్పాటుచేశాడు. దీనిద్వారా కాంట్రాక్టర్లు కార్మికులను, కార్మికులు మంచి కూలీ వచ్చే పనిని యాప్ ద్వారానే ఎంచుకోవచ్చు.
చంద్రశేఖర్ మండల్ ఢిల్లీలో కొత్తగా ఫైనాన్స్ రంగంలో ఉద్యోగంలో చేరాడు. అతని ఆఫీస్ ఉండే ప్రాంతంలో ఒకరోజు విపరీతంగా వర్షం కురుస్తోంది. అతను సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి బయటికి చూస్తూ వేడివేడి కాఫీని ఆస్వాదిస్తున్నాడు. పైనుంచి కిందికి చూసినప్పుడు మనుషుల మధ్య అసమానతలు అతనికి స్పష్టంగా కనిపించాయి. అతను ఒక కార్పొరేట్ ఉద్యోగి కాబట్టి రోజూ ఏసీ గదిలో హాయిగా పనిచేసుకుంటున్నాడు.
కానీ.. అదే బిల్డింగ్‌కి ఎదురుగా లేబర్ చౌక్ (కార్మికులు పని కోసం వెయిట్ చేసే అడ్డా) ఉంది. రోజూ అక్కడికి వందలాది మంది పని కోసం వస్తుంటారు. అలా వచ్చినవాళ్లు ఒక్కసారిగా వర్షం పడడంతో దగ్గర్లోని టీ కొట్టులోకి, చెట్టు కిందకి పరుగెత్తారు. చెట్టుకింద ప్లేస్ సరిపోక కొందరు తడిసిపోయారు. అప్పుడే అతనిలో “ఈ కార్మికులకు పని కల్పించే మార్గం మరొకటి లేదా? ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటూ లేబర్ చౌక్‌ల దగ్గర బారులు తీరాల్సిందేనా? ప్రపంచం మొత్తం డిజిటల్‌గా మారుతున్నప్పుడు, లేబర్ చౌక్‌లు ఎందుకు మారకూడదు?” ఇలా ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.
కరోనా టైంలో..
‘‘వైట్ కాలర్ ఉద్యోగాల సమాచారం అందించేందుకు లింక్డ్ఇన్, నౌక్రీ, ఇండీడ్ లాంటి వేదికలు ఉన్నాయి. అందుకే బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం నేను ఒక ఫ్లాట్‌ఫామ్‌ని నిర్మించి, లేబర్ చౌక్‌లను డిజిటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నా. రోజువారీ కూలీలు కూడా తమ ఇళ్లలోనే ఉండి యాప్ ద్వారానే పని వెతుక్కోగలిగేలా చేయాలి అనుకున్నా” అన్నాడు చంద్రశేఖర్. ఈ నిర్ణయం తీసుకున్న సంవత్సరంలోపే అతను ‘డిజిటల్ లేబర్ చౌక్’ను ప్రారంభించాడు. ఇది రోజువారీ కూలీలకు పని కల్పించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. మూడు సంవత్సరాలుగా ఈ స్టార్టప్ దాదాపు లక్ష మందికి పైగా కార్మికులకు క్రమం తప్పకుండా పని కల్పిస్తోంది.
చిన్నప్పుడే..
చంద్రశేఖర్‌ది బీహార్‌లోని ఒక పల్లెటూరు. బీహార్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో సరైన స్కూళ్లు లేవు. చంద్రశేఖర్ కూడా అలాంటి ఊరి నుంచే వచ్చాడు. పైగా వాళ్లది చాలా పేద కుటుంబం. అతని చిన్నప్పుడే తన మామ పని కోసం సిటీకి వలస వెళ్లడం చూసి చాలా బాధపడ్డాడు. అందుకే ఎప్పుడు కార్మికులను చూసినా వాళ్ల కోసం తనవంతుగా ఏదో ఒకటి చేయాలి అనుకునేవాడు. చదువు పూర్తయ్యాక నోయిడాలో తన మొదటి ఉద్యోగంలో చేరాడు.
అక్కడ కూడా రోజూ లేబర్ చౌక్ గుండానే ఆఫీస్‌కు వెళ్లేవాడు. “45 డిగ్రీల ఎండ కొడుతున్నా, కుండపోత వర్షం కురుస్తున్నా ప్రతిరోజూ దాదాపు 100 మంది ఆ చౌక్ దగ్గర గుమిగూడేవాళ్లు. ఉదయం 9 గంటలకల్లా ఎన్నో ఆశలతో అక్కడికి చేరుకునేవాళ్లు. కానీ.. కొంతమందికే పని దొరికేది. మిగతావాళ్లు మధ్యాహ్నం వరకు చూసి వెంట తెచ్చుకున్న అన్నం తిని నిరాశతో తిరిగి వెళ్లేపోయేవాళ్లు” అని చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు.
కరోనా టైంలో కార్మికుల మీద చాలా ప్రభావం పడింది. ఆ దుస్థితిని చంద్రశేఖర్ దగ్గర్నుంచి చూశాడు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే లేబర్‌చౌక్‌లు మళ్లీ తెరుచుకున్నాయి. కానీ.. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో కనీసం ఆరు అడుగుల దూరం పాటించాల్సి వచ్చింది. ఒక చిన్న లేబర్ చౌక్‌లో వంద మంది కూలీలు ఆ దూరాన్ని ఎలా కొనసాగించగలరు? ఇలా వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత అర్థం చేసుకోవడానికి చంద్రశేఖర్ బిహార్, నోయిడా, ఢిల్లీల్లోని ఎన్నో లేబర్ చౌక్‌లకు వెళ్లి నాలుగు నెలలకు పైగా రీసెర్చ్ చేశాడు. మన దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి పని కల్పిస్తోంది నిర్మాణ రంగమే అని తెలుసుకున్నాడు.
ఉద్యోగానికి రాజీనామా
చంద్రశేఖర్ ఇంటర్ తర్వాత సీఏ ప్రిపరేషన్ మొదలుపెట్టి, మానేశాడు. అందుకే అతని విషయంలో తన ఫ్యామిలీ అంతగా సంతోషంగా లేదు. వాళ్ల నాన్న ఊళ్లో ఒక దుకాణం నడుపుతూ చంద్రశేఖర్‌ని చదువు కోసం ఢిల్లీకి పంపాడు. తను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అని కోరుకున్నాడు. కానీ.. అతను మాత్రం చదువు మానేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. కానీ.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకురావాలనే ఉద్దేశంతో 2020 సెప్టెంబర్‌లో ఉద్యోగం కూడా మానేశాడు. అప్పటికి జేబులో రూ. 20 వేలు మాత్రమే ఉన్నాయి.
కొన్ని నెలలు ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డాడు. ప్రభుత్వ పథకాలు, లోన్ల కోసం అప్లై చేశాడు. ఆ తర్వాత ‘డిజిటల్ లేబర్ చౌక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీని రిజిస్టర్ చేశాడు. పూణెలోని ఒక ఇంక్యుబేటర్ నుంచి కొంత ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. 2021 ఆగస్టునాటికి రూ. 10 లక్షల పెట్టుబడి సమకూరింది. దాంతో వరుస గ్రాంట్లు, పెట్టుబడులు వచ్చాయి.
కొత్తగా ప్రచారం
వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించిన తర్వాత ఎదురైన చట్టపరమైన, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకున్నాడు. స్టార్టప్ కోసం పనిచేయడానికి ఏడుగురు ఉద్యోగులను నియమించాడు. కానీ.. కస్టమర్లు, కూలీలతో యాప్‌లో సైన్ అప్ చేయించడం చంద్రశేఖర్‌కు పెద్ద టాస్క్‌లా అనిపించింది. సాధారణంగా లేబర్ చౌక్‌లకు దగ్గర్లో చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. ఆ షాప్‌ల యజమానులను డిజిటల్ లేబర్ చౌక్‌లో చేర్చుకున్నారు. వాళ్ల ద్వారా కూలీలు యాప్‌లో సైన్‌అప్ చేసుకున్నారు. సమ్మర్‌లో చంద్రశేఖర్, అతని టీం లేబర్ చౌక్‌ల్లో కూల్ డ్రింక్స్ లాంటివి పంచుతూ ప్రచారం చేసేవాళ్లు.
చలికాలంలో చాయ్ ఇస్తూ.. యాప్‌పై అవగాహన కల్పించారు. ఎక్కువ జనాభా ఉండే జిల్లాల్లో కియోస్క్‌లను కూడా ఏర్పాటుచేశారు. కాంట్రాక్టర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, బిల్డర్లను యాప్‌లో రిజిస్టర్ చేయించడానికి బీహార్, నోయిడాలోని బిల్డర్ల సంఘాలు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
కార్మికులకు ఫ్రీ
ఈ ప్లాట్‌ఫామ్ నిర్మాణ సంస్థలు, కార్మికులు, మేస్త్రీలు, పెయింటర్లు, వడ్రంగులు లాంటివాళ్ల కోసమే పని చేస్తుంది. ఒక కస్టమర్ (కాంట్రాక్టర్) సైన్ అప్ చేసినప్పుడు వర్క్ ప్లేస్, పని రకం, రోజుకు కూలీ, పని దినాలు, ఫుడ్, వసతి లాంటి సౌకర్యాలు కల్పిస్తారా? లేదా?.. ఇలాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కూలీలకు యాప్‌లో ఈ వివరాలన్నీ కనిపిస్తాయి. వాళ్ల ఇంట్రస్ట్‌ని తెలియజేయడానికి నేరుగా జాబ్ పోస్టర్‌కు కాల్ చేయొచ్చు.
కూలీలు యాప్‌లో సైన్ అప్ అయ్యేటప్పుడు వాళ్ల స్కిల్స్, గత అనుభవాలు, కనీస వేతనం ఎంత కావాలి? ఇలాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు పది మంది కూలీల కాంటాక్ట్‌లు ఫ్రీగా పొందవచ్చు. ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కూలీలకు మాత్రం ఇది ఉచితం. అంతేకాకుండా స్కిల్డ్ లేబర్ కొరత ఉండడాన్ని గమనించి కార్మికులకు అప్‌స్కిల్లింగ్ కోర్సులను అందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు చంద్రశేఖర్.
భయం లేదు
బిహార్‌లోని దర్భాంగాకు చెందిన శ్రావణ్ కుమార్‌కు యాప్ ద్వారా ఒక బిల్డర్ దగ్గర పని దొరికింది. సంవత్సరం నుంచి అతను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కాంట్రాక్టుపై పని చేస్తున్నాడు. “ఇప్పుడు ప్రతిరోజూ పని దొరకడం వల్ల నేను మూడు ఏండ్లలో సంపాదించేది ఒకే సంవత్సరంలో సంపాదించా. పని కోసం రోజూ లేబర్ చౌక్ దగ్గర నిలబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. ఒక కాంట్రాక్ట్ పూర్తయ్యే టైంకి యాప్ ద్వారా మరోదాన్ని ఎంచుకోవచ్చు” అని చెప్పాడు శ్రావణ్. చంద్రశేఖర్ చెప్పినదాని ప్రకారం చాలా ప్రాజెక్టుల్లో కనీసం 21 రోజులు ఉంటుంది.
యాప్‌లో ప్రతిరోజూ 500 నుంచి 1,000 ఉద్యోగాలు పోస్ట్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థను నడుపుతున్న అజార్ అన్సారీ ‘‘మాకు ఎప్పుడూ లేబర్ కొరత ఉండేది. మేం కార్మికుల కోసం వెతుకుతున్నప్పుడు యాప్ గురించి తెలిసింది. ఇప్పుడు మా అవసరాలకు అనుగుణంగా చాలామంది కార్మికులు దొరుకుతున్నారు” అని చెప్పాడు.