
- కలెక్టర్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జాతీయ రహదారి 167కే నిర్మాణ పనులకు భూసేకరణను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి 79.3 కిలోమీటర్ల నిర్మాణానికి 106.7 హెక్టార్ల విస్తీర్ణం భూమి అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు 77.5 హెక్టార్ల విస్తీర్ణం భూ సేకరించినట్లు తెలిపారు.
మిగతా 29.2 హెక్టార్ల విస్తీర్ణం భూసేకరణ పనులను అక్టోబర్ 15 వరకు పూర్తి చేస్తామని చెప్పారు. నాగర్ కర్నూల్ మండల పరిధిలోని మూడు గ్రామాల పరిధిలోని భూ సేకరణ పనులను పూర్తి చేస్తామన్నారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో మిగిలిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అమరేందర్, ఆర్డీవోలు సురేశ్, బన్సీలాల్, జనార్దన్ రెడ్డి, నేషనల్ హైవే డీఈ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.