ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ లేదు : ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ లేదు : ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
  • అన్ని కాలేజీల్లో సెప్టెంబర్ 26న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్     
  • త్వరలోనే 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకం 
  • ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  ఈ విద్యా సంవత్సరం కూడా ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం అమలు చేయడం లేదని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. ప్రస్తుతం సర్కారు కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు కాలేజీల్లోని ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామని, పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఇంటర్మీడియెట్ కాలేజీల్లో తొలిసారిగా ఈ నెల 26న మెగా టీచర్స్, పేరెంట్స్ మీటింగ్(పీటీఎం) నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇక నుంచి ప్రతినెలా పీటీఎం సమావేశాలు పెడ్తామన్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టును పేర్సెంట్స్ కు వివరిస్తామన్నారు. ఇప్పటికే కాలేజీలకు వచ్చిన విద్యార్థులతో పాటు రాని స్టూడెంట్ల పేరెంట్స్​కు ఎస్ఎంఎస్ రూపంలో ఫోన్​కు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 494 మంది గెస్టు ఫ్యాకల్టీ నియామకానికి సర్కారు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని.. త్వరలోనే వారిని నియమిస్తామని వెల్లడించారు. అప్పటివరకు మాత్రమే కొంతమందికి వర్క్ అడ్జెస్ట్ కింద మూడు రోజులు డిప్యూటేషన్ ఆర్డర్స్ ఇచ్చినట్టు వెల్లడించారు. గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ లో గతేడాది 83,635 అడ్మిషన్లు అయితే, ఈ సారి 8,218 అడ్మిషన్లు పెరిగి, మొత్తం 91,853కు చేరాయన్నారు.

సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ప్రత్యేక కోర్సు 

ప్రత్యేక అవసరాలున్న పిల్లల(సీడబ్ల్యూఎస్ఎన్)కు పైలెట్ ప్రాజెక్టు కింద మూడు కాలేజీల్లో స్పెషల్ హెచ్ఈసీ గ్రూపును ప్రారంభిస్తున్నట్టు కృష్ణ ఆదిత్య చెప్పారు. విద్యానగర్​ జూనియర్ కాలేజీ(హైదరాబాద్), సరూర్ నగర్ కాలేజీ (రంగారెడ్డి), కుత్బుల్లాపూర్ కాలేజీ(మేడ్చెల్)లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తీసుకోనున్నట్టు తెలిపారు. ఆయా కాలేజీల్లో హిస్టరీ/సివిక్స్, ఎకనామిక్స్ పాఠాలు చెప్పేందుకు గెస్టు ఫ్యాకల్టీని నియమించనున్నట్టు వెల్లడించారు.