- రూ.46 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.46.46 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కేసు వివరాలను వెల్లడించారు. ఈస్ట్ ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన జైచంద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రేమ్ షాలిక్‌రామ్ ఖత్రి, సతేంద్ర గుప్తా కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలో కారును దొంగిలించి నకిలీ నంబర్ ప్లేట్లు, ఫేక్ ఫాస్ట్‌ట్యాగ్ అమర్చి తెలంగాణలోకి ప్రవేశించారు. ఈ నెల 23న ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో ఒక ఇంట్లో చోరీ చేసిన నిందితులు, అదే రోజు ఆర్మూర్, ఇందల్‌వాయిలో బస చేసి 24న కామారెడ్డి జిల్లాలో మరో చోరీకి పాల్పడ్డారు. అనంతరం 25న హైదరాబాద్ పరిసరాల్లో సంచరించి, 26న వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేటలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో భారీ చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బుధవారం ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వారిని చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 331 గ్రాముల బంగారం, 718 గ్రాముల వెండి ఆభరణాలు, స్విఫ్ట్ కారు, రూ.15,200, నాలుగు సెల్‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో హత్య, హత్యాయత్నం, రాబరీ, చైన్‌స్నాచింగ్ కేసులు కూడా నమోదయ్యాయని, పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్‌ఐలు అశోక్, గోపి తదితరులు పాల్గొన్నారు
