లెక్చరర్ తిట్టిండని స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

లెక్చరర్ తిట్టిండని  స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

కారేపల్లి, వెలుగు: లెక్చరర్ తిట్టిండని మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి, పేరెంట్స్ తెలిపిన మేరకు.. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ సీఈసీ గ్రూప్ విద్యార్థి మూడు రోజుల కింద కాలేజీ స్టడీ అవర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లీషు లెక్చరర్ కు సంబంధం లేకున్నా కానీ.. విద్యార్థిని అడ్డుకొని బూతులు తిడుతూ నెట్టేశాడు. 

దీంతో తోటి విద్యార్థుల ముందు అవమానానికి గురైనట్టు భావించిన  విద్యార్థి వెంటనే కారేపల్లి క్రాస్ రోడ్ లో లారీ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లాడు. అతని వెనకాలే తోటి విద్యార్థులు వెళ్లి అడ్డుకుని ఆపేశారు. విద్యార్థి  ఇంటికి వెళ్లి  తల్లిదండ్రులకు చెప్పడంతో సోమవారం కాలేజీ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ విజయ కుమారిని వివరణ కోరగా..  లెక్చరర్ తిట్టినది తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దురుసుగా ప్రవర్తించిన ఇంగ్లీషు లెక్చరర్ వేణుకు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు.