జూబ్లీహిల్స్ : కాలేజీకి వెళ్లిన తొలిరోజే ఓ ఇంటర్ స్టూడెంట్ను మృత్యువు కబళించింది. హైదరాబాద్ లోని మధురానగర్ పీఎస్ పరిధిలోని యాదగిరినగర్ వద్ద తన అక్క బస్సు ఎక్కలేదని.. రన్నింగ్ బస్సు నుంచి దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ బస్సు చక్రాల కిందపడి చనిపోయింది. పోలీసుల కథనం ప్రకారం..బోరబండ సబ్దర్నగర్కు చెందిన మహ్మద్ సలీముద్దీన్, ఆరీఫా సుల్తానా దంపతులకు ఐదగురు పిల్లలు. వీరిలో నలుగురు కూతుళ్లు కాగా, ఒక కొడుకు ఉన్నాడు. సలీముద్దీన్సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతడి బిడ్డలైన మసీరా మెహ్రీన్, మెహక్ రహ్మత్‌నగర్‌లోని
మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. అక్క మెహక్ సెకండియర్కాగా, చెల్లి మెహ్రీన్ ఈ ఏడాదే (సీఈసీ) ఫస్ట్‌ఇయర్‌లో జాయిన్అయ్యింది. శుక్రవారం మొదటిసారి కాలేజీకి వచ్చిన మెహ్రీన్ మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు యూసుఫ్‌గూడ క్రాస్ రోడ్డు వద్ద సికింద్రాబాద్ నుంచి బోరబండ వెళ్లే కూకట్పల్లి డిపో బస్సు ఎక్కింది. ఈమె వెంటే ఉన్న అక్క మెహక్ బస్సు ఎక్కలేదని గమనించి రన్నింగ్ బస్సులో నుంచి దిగబోయింది. ఈ క్రమంలో మెహ్రీన్ బస్సు వెనక టైరు కింద పడి అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్గోవిందు పంజాగుట్ట పీఎస్‌లో లొంగిపోయాడు.
