ఇవేం ఫలితాలు? : ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

ఇవేం ఫలితాలు? : ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులపై విద్యార్థుల తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేశారు.

ఇంటర్ మెమోలో మార్కులు తారుమారు అయ్యాయని విద్యార్థుల సంబంధీకులు ఆరోపించారు. మెరిట్ విద్యార్థులకు కూడా యావరేజీ  మార్కులు వేశారని అన్నారు. ఛాలెంజింగ్ వెరిఫికేషన్ పెట్టుకునే స్తోమత మాకు లేదని.. కష్టపడి పరీక్షలు రాసినా ఈ గతి మాకెందుకని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.

వివరణ ఇచ్చేందుకు వచ్చిన రాష్ట్ర ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అశోక్ ను విద్యార్థులు.. తల్లిదండ్రులు.. నిలదీశారు. అశోక్ చెప్పిన వివరణను తీవ్రంగా తప్పుపట్టారు. తప్పు చేసి బుకాయిస్తున్నారనీ.. తమ జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇంటర్ బోర్డ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కామెంట్లు వారి మాటల్లోనే….

“నాంపల్లి ఆఫీస్ కు ఇవాళ పొద్దున వచ్చాం. ఏ సబ్జెక్ట్ లో ఫెయిలయ్యారో రాసివ్వాలని అడిగారు. రాసిచ్చాం. మధ్యాహ్నం వచ్చి చూస్తే.. మేం రాసిచ్చిన పేపర్ డస్ట్ బిన్ లో ఉంది. మేమేం చేయాలిప్పుడు”-(కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ విద్యార్థిని).

“ఓసారి ఈ మార్కుల షీట్ చూడండి. అన్నీ టాప్ మార్కులే. మా పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి.. కానీ.. తక్కువొచ్చాయి. ఆన్ లైన్ లో వెరిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. అది పనిచేయడం లేదు” –  ఓ తండ్రి ఆవేదన.

“జువాలజీలో 60కి నాకు 68 మార్కులొచ్చినట్టుగా మెమోలో ఉంది”- ఓ విద్యార్థి సాక్ష్యం

“అన్ని సబ్జెక్టుల్లో 90 పర్సెంట్ మార్కులొచ్చినా.. ఒక సబ్జెక్ట్ లో ఎలా ఫెయిలవుతారు.. “- ఓ పేరెంట్

“బోర్డు చేసిన తప్పులకు మేమెందుకు బాధ్యత వహించాలి”- మరో బాధిత విద్యార్థి ఆవేదన.

“నా ప్రతిభకు తగ్గ మార్కులే రాలేదు. కాలేజీలో నేను టాపర్ ను. 3 ప్రి ఫైనల్స్ లో టాప్ మార్కులు తెచ్చుకున్నా. కానీ.. మెయిన్ ఎగ్జామ్ లో ప్రతి సబ్జెక్ట్ లో యావరేజ్ మార్కులు వేశారు. కాలేజీలో ముఖం చూపించుకోలేకపోతున్నా”- ఓ విద్యార్థి ఆవేదన.