ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రద్దు..?

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రద్దు..?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్‌ అడ్వాన్డ్స్​సప్లిమెంటరీ పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై సర్కారు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయసలహా తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. సప్లిమెంటరీ నిర్వహించకుండా, అందరినీ పాస్ చేస్తే ఏమైనా న్యాయ సమస్యలు వచ్చే అవకాశముందా..? అనే అంశాన్ని పరిశీలించాలని ఇంటర్ బోర్డు అధికారులకు ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై హైకోర్టు ఏజీని కలిసి చర్చించనున్నట్లు సమాచారం. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రద్దు చేస్తే .. ఎంసెట్​లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటంతో, ఫస్టియర్ స్టూడెంట్స్ కోర్టును ఆశ్రయించే చాన్స్​ఉంటుందని భావిస్తున్నారు. అలాంటి విద్యార్థులకు అవసరమైతే కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత డిసెంబర్ లేదా జనవరిలో ఎగ్జామ్స్ నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎగ్జామ్స్ రద్దు చేస్తే మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ అయినట్టు ప్రకటించవచ్చు. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ర్టంలో దాదాపు 9. 66 లక్షల సూడెంట్స్ హాజరయ్యారు. మూడు రోజుల క్రితం ఫలితాలు విడుదలయ్యాయి. దీంట్లో ఫస్టియర్​లో 60 . 01 శాతం మంది పాస్ కాగా సెకండియర్​లో 68. 86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 4,70,999 మంది ఫెయిల్ అయ్యారు.

సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించలే

ఏపీలో టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులూ పాస్ అయినట్టేనని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై స్టూడెంట్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏటా వార్షిక పరీక్షల టైమ్ లోనే సప్లిమెంటరీ షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈసారి కరోనా ఎఫెక్ట్ తో తేదీలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ రద్దు అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి